స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలుసా?

వడ్డీ రేట్లలో మార్పులు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి...

Published : 23 Dec 2020 15:48 IST

వడ్డీ రేట్లలో మార్పులు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి

స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 41,000 ల మార్క్ ను , నిఫ్టీ 50 12,100 ల మార్క్ ను తాకాయి . అయితే ఆర్ధిక గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో , మార్కెట్, ఆర్ధిక గణాంకాల మధ్య ఏర్పడిన అసంబద్ధతో మదుపరులు గందరగోళానికి గురవుతున్నారు . స్టాక్ మార్కెట్లు స్వల్ప కాలంలో హెచ్చుతగ్గులకు లోనవుతాయి . అయితే దీర్ఘకాలంలో పరిశీలించినట్లయితే , నిలకడగా పెరుగుదల కనిపిస్తుంది. మదుపరులు మార్కెట్ పోకడలను గమనించి, తగు నిర్ణయం తీసుకోవాలి.

మదుపరులు మార్కెట్ పోకడల గురించి తెలుసుకునే ముందు , వాటి పరిభాష కూడా తెలుసుకోవాలి . ధరలలో పెరుగుదలను అప్ ట్రెండ్ అనీ, తగ్గుదలను డౌన్ ట్రెండ్ అనీ అంటారు. షేర్ ధరలలో పెరుగుదల మదుపరులకు ఆనందాన్నివ్వవచ్చు . ఆరోగ్యకరమైన అప్ ట్రెండ్ లో 20-25 శాతం వరకు లాభం పొందొచ్చు. మదుపరులు మార్కెట్ ట్రెండ్లను గమనిస్తూ, తమ రిస్క్ సామర్ధ్యం, ఆశించే రాబడి ని బట్టి పోర్ట్ ఫోలియో ను తయారుచేసుకోవచ్చు . అయితే స్టాక్ మార్కెట్‌ ల కదలికలకు అసలు కారణాలు తెలుసుకోవాలి .

వడ్డీ రేట్లు : వడ్డీ రేట్లలో మార్పులు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి. ఉదా : యు ఎస్ ఫెడరల్ రిజర్వు 25 బీపీఎస్‌ (0.25 శాతం) వడ్డీ రేటు పెంచితే, భారత్ కూడా తమ వడ్డీ రేట్లను పెంచవచ్చు . దీనివలన కార్పొరేట్ లపై వడ్డీ భారం పెరిగి , లాభాలు తగ్గుతాయి. అందువలన అవి తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తాయి .

అలాగే డాలర్ విలువ పెరగడం, రూపాయి తగ్గడం జరుగుతాయి . ముడిచమురు ధరలు, వడ్డీ రేట్లు పెరగడం వలన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లిపోతుంది. ఇవి స్వల్పకాలం స్టాక్ మార్కెట్ లపై ప్రభావం చూపుతాయి .

ద్రవ్యోల్బణం : వస్తుసేవల ధరలలో పెరుగుదలను ద్రవ్యోల్బణం గా పరిగణిస్తాము . అధిక ధరల వలన కొనుగోలు శక్తి తగ్గి, వస్తుసేవల వినిమయంతో పాటు మదుపు చేసే శక్తి కూడా తగ్గుతుంది .డబ్బు విలువ కూడా పడిపోతుంది. అధిక ధరల చేత వస్తుసేవల వినిమయం తగ్గితే కంపెనీలతో పాటు ప్రజలకు నష్టమే. తద్వారా దీర్ఘకాలంలో ఆర్ధిక వృద్ధి కూడా ఉండదు.

గ్లోబల్ మర్కెట్స్ : మన స్టాక్ మార్కెట్లపై గ్లోబల్ మర్కెట్ల ప్రభావం కూడా ఉంటుంది . అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా , విదీశీ మదుపరులు మన స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడి పెడతారు . గత కొద్ది ఏళ్లుగా ఇది మనం గమనిస్తున్నాము . దీనివలన మన స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులను చూస్తున్నాము.

భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ లకు ఎగుమతి చేయడం, విదేశీ స్టాక్ ఎక్స్చేంజి లైన న్యూయార్క్, లండన్ వంటి స్టాక్ మార్కెట్ లలో నమోదు కావడం జరుగుతున్నాయి . తద్వారా ఆదాయం కూడా పెంచుకుంటున్నాయి . కాబట్టి అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలో వచ్చే మార్పులకు మన కంపెనీలు కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతాయి . అంతర్జాతీయంగా వస్తుసేవల వినిమయం తగ్గితే, అక్కడకు ఎగుమతి చేసే మన కంపెనీల ఆదాయం తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ద్వారా లభించే ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివలన ఆ కంపెనీల షేర్ ధరలు కూడా తగ్గుతాయి.

డిమాండ్, సరఫరా ను బట్టి వస్తుసేవలు, కరెన్సీ , ఇతర పెట్టుబడుల ధరలలో మార్పులు ఏర్పడతాయి . అవసరానికి మించి సరఫరా వుంటే, ధరలు తగ్గడం, లేకపోతె ధరలు పెరగడం జరుగుతుంది . అలాగే షేర్ ధరలలో కూడా మార్పులు వస్తాయి. షేర్లలో పెట్టుబడి కి ప్రమాదం ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన ఏర్పరుచుకుని , క్రమశిక్షణ తో పెట్టుబడి చేసినట్లయితే , సంపద చేకూర్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని