Stock market : ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.....

Updated : 11 Jan 2022 09:57 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకుని తిరిగి కోలుకున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయ కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలతో సూచీలు నిన్న పరుగులు తీశాయి. ఈ నేపథ్యంలో గరిష్ఠాల వద్ద నేడు కొంత మేర లాభాల స్వీకరణ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీల పయనం ప్రారంభంలో కొంత ఊగిసలాట మధ్య సాగుతోంది. 

ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 107 పాయింట్ల లాభంతో 60,502 వద్ద.. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు లాభపడి 18,030 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.93 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా కన్జ్యూమర్‌, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్‌, శ్రీరాం సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

*  పేటీఎం: కంపెనీ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు లక్షిత ధరను రూ.900కు తగ్గిస్తున్నట్లు, షేరు రేటింగ్‌ను ‘అండర్‌పెర్ఫార్మ్‌’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మెక్వారీ వెల్లడించింది. 2021 నవంబరు 18న స్టాక్‌ మార్కెట్‌లో అరంగేట్రం చేసిన పేటీఎం షేరు ఇప్పటివరకు ఇష్యూ ధరకు చేరనేలేదు. ఇష్యూ ధర రూ.2150తో పోలిస్తే దాదాపు 45 శాతం పతనమైంది.

* మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌: కంపెనీ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌)లో యూఎస్‌ పెట్టుబడుల సంస్థ అయిన బ్లాక్‌స్టోన్‌ తనకున్న 9.2 శాతం వాటా విక్రయించింది. ప్లాటినం ఇల్యూమినేషన్‌ ట్రస్ట్‌ ఈ వాటా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 5.43 కోట్ల యూనిట్లను సగటున రూ.320 చొప్పున కొనుగోలు చేసినందున, ఈ లావాదేవీ విలువ రూ.1740 కోట్లుగా చెబుతున్నారు. 

* స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ : వ్యవస్థాపకుల నుంచి రూ.300 కోట్ల నిధులు సమీకరించనున్నారు.  

* యాక్సిస్‌ బ్యాంక్‌ : రాజీవ్‌ ఆనంద్‌ను మరో మూడేళ్ల పాటు తిరిగి డిప్యూటీ ఎండీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

* బ్యాంక్ ఆఫ్‌ బరోడా ‌: ఎంసీఎల్‌ఆర్‌ను 6.50 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించింది. జనవరి 12 నుంచి ఇది అమల్లోకి రానుంది.

* జేఎస్‌డబ్ల్యూ ఇస్పాత్‌ స్పెషల్‌ ప్రోడక్ట్స్‌ : కంపెనీ ముడి ఉక్కు ఉత్పత్తిలో త్రైమాసిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధి నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని