Stock market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 19 Jan 2022 09:47 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోవైపు చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ ప్రతికూల పరిణామాలే సూచీలను కిందకు లాగుతున్నాయి. అయితే, నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో ఇంట్రాడేలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ సానుకూలంగా ఉండడం, ప్రీ-బడ్జెట్‌ ఆశలు.. నష్టాల్ని కట్టడి చేసే అవకాశం ఉందని తెలిపారు.   

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 474 పాయింట్ల నష్టంతో 60,280 వద్ద.. నిఫ్టీ (Nifty) 133 పాయింట్లు నష్టపోయి 17,979 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.69 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* బజాజ్‌ ఫైనాన్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) డిసెంబరు త్రైమాసికంలో బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.2,125.29 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,145.98 కోట్లతో పోలిస్తే ఇది 85.5 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.6,658.34 కోట్ల నుంచి రూ.8,535.06 కోట్లకు పెరిగింది.

* హీరో మోటోకార్ప్‌: గొగోరో సంస్థలో కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం ఓవర్‌సబ్‌స్క్రైబ్డ్‌ ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ పబ్లిక్‌ ఈక్విటీ డీల్‌ మార్గాన 257-285 మిలియన్‌ డాలర్లు వెచ్చించనుంది. 

* ఎన్‌టీపీసీ‌: 900 మెగావాట్ల క్యూబా సోలార్‌ పీవీ పార్క్‌ అభివృద్ధికి కంపెనీ డెవలపర్ల నుంచి బిడ్లు ఆహ్వానించింది. 

* హెచ్‌సీఎల్‌ టెక్‌: ఇంటెల్‌ క్లైంట్స్‌ కోసం మరింత అధునాతన సేవలు అందించేందుకు కంపెనీ డెడికేటెడ్‌ ఇంటెల్‌ ఎకోసిస్టం యూనిట్‌ను ప్రారంభించనుంది. 

* పేజ్‌ ఇండస్ట్రీస్‌: ఫిబ్రవరి 10న మూడో మధ్యంతర డివిడెండ్‌పై కంపెనీ భేటీ కానుంది.   

* సింఫనీ: రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటనపై జనవరి 25న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. 

* జేకే పేపర్‌‌: గుజరాత్‌లో కంపెనీ ప్యాకేజింగ్‌ బోర్డు కొత్త తయారీ యూనిట్‌ను ప్రారంభించింది.

* ఈరోజు త్రైమాసిక ఫలితాలు వెల్లడించబోయే కంపెనీలు: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ ఇస్పత్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, టాటా కమ్యూనికేషన్స్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, సియట్‌, సరేగమ ఇండియా, మస్టెక్‌, సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సాఫ్ట్‌వేర్‌, సెర్లైట్‌ టెక్నాలజీస్‌, సింజిన్‌ ఇంటర్నేషనల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని