అపోహలు వీడితేనే.. ఆర్థిక విజయం! 

మున్ముందు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఇప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Updated : 05 Apr 2021 16:39 IST

భారతీయులు మంచి పొదుపరులు. కానీ, పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. భవిష్యత్తుపై ముందుచూపు, ఆలోచనలు ఉంటాయి. అందులో కొన్ని కాలం చెల్లిన పద్ధతులు, అపోహలు ఇంకా ఉన్నాయి. మరి అవేమిటి? వాటిలో నిజాలెంత? మున్ముందు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఇప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం! ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ప్రత్యేకంగా పదవీ విరమణ తర్వాత కోసం మదుపు చేయాలా? పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తే… మన మలి వయసులో వారే చూసుకుంటారు… అనే ఆలోచన ఎంతోమందిలో ఉంటుంది. నిజమే! గతంలో ఇది సాధ్యమయ్యిందేమో! కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పిల్లలు తమ కలల సాధనకు తీవ్రంగా శ్రమిస్తున్న రోజులివి. ఇలాంటప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారిని ఇబ్బంది పెట్టకూడదు. అదే సమయంలో నేటి తరం తల్లిదండ్రులు తాము ఎవరిమీదా ఆధారపడాలని కోరుకోవడం లేదు. అందుకే, ఆర్థిక ప్రణాళికలో మలి జీవితానికి సంబంధించి తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగిన పెట్టుబడులను ముందునుంచే ప్రారంభించాలి. అప్పుడే, పదవీ విరమణ తర్వాత కూడా ఎవరిపైనా ఆధారపడకుండా విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపగలరు.
నష్టాలే వస్తాయి…

భారతీయుల్లో చాలామందికి ఈక్విటీ మార్కెట్లంటే ఉన్న భావన ఏంటో తెలుసా? అందులో పెట్టుబడులు పెడితే నష్టాలు తప్ప లాభాలు రావు. ‘నేను స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టి కొన్ని రూపాయలు నష్టపోయాను’… ‘షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు’ అని, మార్కెట్‌ అంటేనే జూదం… నేను బాగా నష్టపోయాను. అందుకే మళ్లీ ఎప్పటికీ దాని జోలికి వెళ్లదల్చుకోలేదు… ఇలాంటి మాటలూ వినిపిస్తుంటాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇవన్నీ కూడా రోజువారీ లావాదేవీలు నిర్వహిస్తూ… లాభాలు ఆర్జించాలని భావించేవారి అభిప్రాయాలు. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలానికి ఉద్ధేశించినవి. ఒక సంస్థ షేర్లలో పెట్టుబడి పెడుతున్నామంటే… ఆ సంస్థలో మనం భాగస్వాములం అవుతున్నట్లు. ఏ వ్యాపారమూ కూడా ఒకటి రెండు రోజుల్లోనే… కొన్ని నెలల్లోనో మంచి రాబడిని ఇవ్వదు. పెట్టుబడి వృద్ధి చెందాలంటే… దానికి మంచి సమయం ఇవ్వాలి. అప్పుడే లాభాలు ఆర్జించేందుకు వీలవుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఒక లక్ష్యానికి అనుగుణంగా మదుపు చేసేవారికి ఈక్విటీలు ఎప్పుడూ నష్టాలను మిగల్చవనే చెప్పాలి.


స్థిరంగా రాబడి ఇవ్వదు

ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టినప్పుడు స్థిరంగా రాబడిని ఇవ్వదు… అనేది చాలామంది అభియోగం. స్థిరాదాయం ఇచ్చే పథకాలకు భిన్నంగా ఈక్విటీలు ఉంటాయని ఇక్కడ మర్చిపోకూడదు. ఈక్విటీల్లో పెట్టుబడి వెదురు చెట్టులాంటిది. మొదటి ఏడాది ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తుంది. తర్వాత నాలుగైదేళ్లు ఏ మాత్రం వృద్ధి ఉండదు. ఆరో ఏట మంచి పెరుగుదల ఉంటుంది. ఈక్విటీల్లో పెట్టుబడి కూడా ఇలాంటిదే. అందుకే, షేర్లలో మదుపు చేసినప్పుడు మనకు ఓపిక, శ్రద్ధ ఉండాలి.


మార్కెట్‌ ఆధారంగా

కొంతమంది మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడానికి కూడా ఆసక్తి చూపించరు. కారణం ఏమిటంటే… ‘మ్యూచువల్‌ ఫండ్లు మార్కెట్‌ ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి. అందుకే, అందులో పెట్టుబడులు వద్దు’ అని అంటారు. ఇలా నిరాకరించేవారు… కేవలం పెట్టుబడినే కాదు… సగటు ప్రయోజనాన్ని, ఈక్విటీ మదుపు లాభాలను, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్నీ కోల్పోయినట్లే. ఫలితంగా తక్కువ రాబడి ఇచ్చే పథకాల్లోకి పెట్టుబడులు వెళ్లిపోతాయి.


బీమా పెట్టుబడి కాదు

బీమా పథకాలను ఎంచుకునేది కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం కోసం. కానీ, కొంతమంది వీటినీ పెట్టుబడి పథకాల కిందే జమ చేస్తారు. ‘బీమా కూడా పెట్టుబడి’ పథకమే అని అనుకుంటారు. మనం ఆనందంగా జీవించాలంటే… పెట్టుబడులు పెట్టాలి. కానీ, మన అనంతరం కూడా మన మీద ఆధారపడిన వారు ఆర్థికంగా ఏ ఇబ్బందులూ పడకూడదు అనే లక్ష్యంతో జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఆర్జించే ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా గుర్తించాలి.


సురక్షితంగా ఉంటే చాలా?

పెట్టుబడి సురక్షితంగా ఉండే పథకాల్లో మదుపు చేయడం ఎప్పుడూ మంచిదే అనుకుంటారు చాలామంది. ఇది కొంత వరకూ నిజమే. కానీ, కేవలం సురక్షిత పథకాల్లో మదుపు చేసి, ధనవంతులైనవారు ఎవరూ లేరనే సంగతిని ఇక్కడ మనం మర్చిపోకూడదు. చరిత్రను గమనిస్తే…ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు ఇక్కడ వచ్చిన రాబడి తక్కువే. అన్నీ లెక్కేస్తే వచ్చే రాబడి రుణాత్మకంగా కూడా ఉండొచ్చు. అంటే… మీ పెట్టుబడి విలువ తగ్గిపోవడం ద్వారా… మీరు పేదవారుగా మారడానికీ అవకాశం ఉందన్నమాట. అందుకే, ఏ మాత్రం నష్టభయం భరించలేం అనుకొని వీటిని ఎంచుకున్న వారికీ నష్టం వెన్నంటే ఉంటుందనేది వాస్తవం. అందుకే, పెట్టుబడులు ఎప్పుడూ ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని ఆర్జించేలా ఉండాలి.


ఇలా చెప్పుకొంటూ వెళ్తే… ఆర్థిక విషయాల్లో ఉన్న అపోహల జాబితా చాలానే ఉంది. ఇక్కడ మారాల్సింది డబ్బు విషయంలో మన ఆలోచనలు. అప్పుడు మనం ఏం చేయాలన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. తొందరగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈక్విటీల్లో మదుపు చేయాలి. ఓపికతో ఎదురుచూడాలి. తగినంత జీవిత బీమా తీసుకోవాలి. ఇదే… ఆర్థిక విజయానికి ప్రాథమిక సూత్రాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని