డోర్ స్టెప్ సేవ‌ల ద్వారా  ఇంటి వ‌ద్దే లైఫ్ సర్టిఫికెట్‌

వయ‌సు రీత్యా, అనారోగ్యం కార‌ణంగా బ్యాంకులు, పోస్టాఫీసుల‌కు వెళ్ల‌లేని పెద్ద‌ల‌కు ఈ సేవ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

Updated : 13 Oct 2021 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన త‌ర్వాత పెన్ష‌న్ పొందేందుకుగానూ ఫించ‌నుదారులు ఏటా జీవ‌న ప్ర‌మాణ ప‌త్రం (లైఫ్ స‌ర్టిఫికెట్‌) స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప్ర‌తి ఏడాది న‌వంబ‌రు 1 నుంచి 30 తేదీలోపు ఈ ప‌ని పూర్తి చేయాలి. 80 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న వారు అక్టోబ‌రు 1 నుంచే పెన్ష‌న్ స‌ర్టిఫికెట్లు సబ్మిట్‌ చేసే వెసులుబాటును ప్ర‌భుత్వం క‌ల్పించింది. అంటే 80 ఏళ్ల కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న వృద్ధులు ఇప్పుడు అక్టోబ‌రు 1 నుంచి - న‌వంబ‌రు 30 మ‌ధ్య ఈ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించొచ్చు. అయితే వీటిని స‌మ‌ర్పించేందుకు మున‌ప‌టి రోజుల్లో ఫించనుదారులు స్వ‌యంగా బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఈ జీవ‌న ప్ర‌మాణ ప‌త్రాల‌ను ఇంటి నుంచే ఇవ్వొచ్చు.

డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్‌..
డిజిట‌ల్ లైఫ్‌ స‌ర్టిఫికెట్‌ అనేది బ‌యోమెట్రిక్ ఆధారిత డిజిట‌ల్ స‌ర్వీస్‌. ఇత‌ర ప్రాంతాల్లో లేదా దూరంగా ఉన్న పింఛ‌నుదారులు ఏటా పెన్ష‌న్ ఏజెన్సీకి వ‌చ్చి ఈ స‌ర్టిఫికెట్ పొంద‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. ముఖ్యంగా వృద్ధుల‌కు ఇది వ్య‌య‌ ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న ప‌ని. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకే ప్ర‌భుత్వం 2014లో జీవ‌న్ ప్ర‌మాణ్ పేరుతో స‌ర్టిఫికెట్ జారీ చేసేందుకు డిజిట‌ల్‌ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. దీంతో వారు హోమ్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా బ‌యోమెట్రిక్ ద్వారా స‌ర్టిఫికెట్ పొందొచ్చు. అథెంటికేష‌న్ పూర్త‌యిన తర్వాత‌ డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ జ‌న‌రేట్ అవుతుంది. దీన్ని పెన్ష‌న్ ఏజెన్సీలు నిల్వ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ వ‌ద్ద స్కాన‌ర్‌ లేదా కంప్యూట‌ర్, మొబైల్ వంటి అవ‌స‌నమైన ప‌రిక‌రాలు లేకుంటే సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్‌సీ) లేదా పోస్టాఫీస్‌, బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లి అస‌వ‌ర‌మైన వివ‌రాల‌ను అందించి డిజిటల్ లైఫ్ స‌ర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఇంటి వ‌ద్దే..
ప్ర‌భుత్వ రంగ బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు కూడా ఇప్ప‌టికే ప‌లు ర‌కాల డోర్ స్టెప్ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. ఇప్పుడు పెన్ష‌న‌ర్ల‌కు కూడా లైఫ్ స‌ర్టిఫికెట్‌ను డోర్ స్టెప్ స‌ర్వీస్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాయి. వయ‌సు రీత్యా, అనారోగ్యం కార‌ణంగా బ్యాంకులు, పోస్టాఫీసుల‌కు వెళ్ల‌లేని పెద్ద‌ల‌కు, మొబైల్ వాడ‌కం, అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానం గురించి అవ‌గాహ‌న లేని పెద్ద‌ల‌కు, ఈ సేవ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

డోర్‌స్టెప్ స‌ర్వీస్ ద్వారా లైఫ్ స‌ర్టిఫికెట్‌ ఎలా సమ‌ర్పించాలి?
*
ఇందుకోసం ముందుగా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* మీ బ్యాంకును ఎంపిక చేసుకుని లైఫ్ స‌ర్టిఫికెట్‌ స‌మర్ప‌ణ కోసం డోర్ స్టెప్‌ స‌ర్వీస్‌ను అభ్య‌ర్థించాలి.

* ఇక్క‌డ మీ పెన్ష‌న్ ఖాతా నంబర్‌ను ఎంటర్‌ చేసి ధ్రువీకరించాలి.

* ధ్రువీకరించిన తర్వాత డోర్‌స్టెప్ స‌ర్వీస్ కోసం ఎంత ఛార్జ్ చేస్తారో క‌నిపిస్తుంది. ప్రొసీడ్‌ను క్లిక్ చేసి, నామమాత్ర‌పు రుసుముల‌ను చెల్లించి డోర్ స్టెప్ సేవ‌ల‌ను పొందొచ్చు.

* అభ్య‌ర్థన పూర్తి చేసిన త‌ర్వాత, ఏజెంట్ పేరును పేర్కొంటూ మీకు ఎస్సెమ్మెస్‌ వస్తుంది.

* బ్యాంక్ నుంచి వ‌చ్చిన ఏజెంట్ మీ ఇంటికి వచ్చి లైఫ్ స‌ర్టిఫికెట్‌ సబ్మిషన్‌ ప్రక్రియను పూర్తిచేస్తారు.

డోర్‌స్టెప్ విధానంలో పోస్ట్‌మేన్ ద్వారా డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌బ్మిట్ చేసే విధానం..
పింఛనుదారులు పోస్ట్ ఇన్‌ఫో మొబైల్ యాప్ లేదా ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా డోర్‌స్టెప్ స‌ర్వీస్ కోసం అభ్య‌ర్థించొచ్చు. పింఛన్‌దారుల మొబైల్ నంబరుకు వచ్చే పార్మాన్ ఐడీ ద్వారా త‌క్ష‌ణ‌మే స‌ర్టిఫికెట్ జ‌న‌రేట్ అవుతుంది. పెన్ష‌న్ డిపార్ట్‌మెంట్‌ వద్ద స్వ‌యంచాల‌కంగా లైఫ్ స‌ర్టిఫికెట్‌ వివ‌రాలు అప్‌డేట్ అవుతాయి.

డోర్ స్టెప్ విధానం ద్వారా కాగిత ర‌హిత డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను జ‌న‌రేట్ చేసేందుకు కావ‌ల‌సిన ప‌త్రాలు..
1.
పెన్ష‌న్ ఐడీ
2. పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్
3. పెన్ష‌న్ పంపిణీ సంస్థ వివ‌రాలు
4. బ్యాంక్ ఖాతా వివ‌రాలు
5. మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ
6. ఆధార్ సంఖ్య‌
దేశ‌వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ పెన్ష‌న‌ర్లంద‌రికీ.. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ఈ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ఈ సేవ‌లు పొందేందుకు రూ.70 నామ‌మాత్ర‌పు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని