సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కంతో ఉన్నత విద్యకు ప్రణాళిక

సుక‌న్య స‌మృద్ది యోజ‌న పొదుపును ఉన్నత విద్య‌కు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

Updated : 15 Nov 2021 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న బాలిక‌ల‌ కోసం అందుబాటులో ఉన్న అద్భుత‌మైన పెట్టుబ‌డి ప‌థ‌కం. ఈ ప‌థ‌కానికి వ‌డ్డీ రేటు కూడా 7.6% ప్రభుత్వం ఇస్తోంది. ఇంత వ‌డ్డీరేటు అయితే పోస్టాఫీసులోని ఏ ప‌థ‌కానికీ లేదు. ప్రభుత్వ మద్దతుతో కూడిన ఈ ప‌థ‌కం చాలా మంచి పొదుపు ప‌థ‌క‌మ‌నే చెప్పాలి. అయితే ఈ ప‌థ‌కంలో పొదుపు చేసిన సొమ్ము బాలిక‌లు మేజ‌ర్ అయిన త‌ర్వాత పెళ్లికి మాత్రమే కాదు.. వారి ఉన్నత విద్యకు కూడా ఉపయోగించొచ్చు. 10 ఏళ్లలోపు బాలిక‌ల కోసం ప్రభుత్వం 2014లో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కంలో ఏడాదికి కనీసం రూ.250, గ‌రిష్ఠంగా రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా 15 సంవత్సరాల పాటు రూ. 1.5 లక్షలు చొప్పున పెట్టుబడి పెడితే ఆపై 7.6% వ‌డ్డీ రేటుతో రూ.44 ల‌క్షలు వరకు సమకూర్చుకోగలరు. ఇప్పటి పరిస్థితుల్లో ఇది పెద్ద మొత్తమేగానీ 15 ఏళ్ల తర్వాత విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం సరిపోకపోవచ్చు.

ఉదా: మీ కుమార్తెకు 3 సంవ‌త్సరాల వయస్సు ఉన్నప్పుడు సుక‌న్య స‌మృద్ధి యోజన పథకంలో పొదుపు ఆరంభించి 15 సంవ‌త్సరాలకు ఏడాదికి రూ.1.5లక్షలు పెట్టుబడి పెడితే 7.6% వ‌డ్డీ రేటుతో దాదాపు రూ.44 లక్షల వరకు నిధి జమ అవుతుంది. కానీ మీ కుమార్తెను 15 సంవ‌త్సరాల తర్వాత అంత‌ర్జాతీయ అత్యుత్తమ కళాశాలల్లో జాయిన్ చేయాల‌నుకుంటే ఈ మొత్తం ఎంత మాత్రం స‌రిపోదు. ప్రస్తుతం అమెరికాలో కళాశాల విద్యకు ఏడాదికి రూ.40 నుంచి రూ. 55 లక్షల వరకు ఖర్చవుతోంది. 15 ఏళ్లలో విద్యా ద్రవ్యోల్బణంతో ఈ క‌ళాశాలల‌ ఫీజులు, ఖ‌ర్చులు కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉంది.

విదేశీ క‌ళాశాల‌లు కాకున్నా భార‌తీయ క‌ళాశాల‌లను పరిగణనలోకి తీసుకున్నా.. 15 ఏళ్ల తర్వాత పది శాతం వడ్డీ రేటుతో వాటి ఫీజులు ఇలా ఉండొచ్చు..
సాధార‌ణ కోర్సులు: ఇప్పుడు రూ.4 లక్షలు ఖర్చయితే 15 ఏళ్ల తర్వాత రూ.15-20 లక్షలు ఖర్చవుతుంది.
ఇంజినీరింగ్ కోర్సులు: ఇపుడు రూ.15 ల‌క్షలు ఖర్చయితే 15 ఏళ్ల త‌ర్వాత రూ.40-50 ల‌క్షల దాకా ఖర్చవుతుంది.
ఎంబీబీఎస్‌ కోర్సు: ఎంట్రన్స్‌ ర్యాంకును బట్టి ఇప్పుడు రూ.40-50 ల‌క్షలు ఖర్చయితే, 15 ఏళ్ల త‌ర్వాత రూ.1.05 కోట్ల నుంచి రూ.1.25 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చవుతుంది.
మేనేజ్మెంట్ కోర్సులు: ప్రస్తుతానికి రూ. 15-20 లక్షలు ఖర్చయితే 15 సంవ‌త్సరాల తర్వాత రూ.50 లక్షలు దాకా ఖ‌ర్చు కావొచ్చు.

కాబ‌ట్టి సుక‌న్య స‌మృద్ధి పథకం ద్వారా స‌మ‌కూర్చుకున్న మొత్తం మీ పాప ఉన్నత విద్యకు సరిపోతుందా? లేదా? అనేది మీ పాప ఎంచుకున్న క‌ళాశాల‌, కోర్సుపై ఆధార‌ప‌డి ఉంటుంది. అందుచేత ఇప్పటి నుంచే పొదుపు చేసేవారు ఆదాయ సామ‌ర్ధ్యం, పిల్లలను విద్య కోసం ఎక్కడికి పంపాలనుకుంటున్నారు? అనే దాని ప్రకారం పెట్టుబడులు ప్రారంభించాలి. సుక‌న్య స‌మృద్ధితో పాటు భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈక్విటీల్లోనూ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబ‌డికి ఈక్విటీల్లో ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఇతర ఫండ్లతో పోలిస్తే రిస్క్‌ తక్కువ ఉంటుంది.

గ‌మ‌నిక: ఫీజులు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇచ్చాం. వేర్వేరు క‌ళాశాల‌ల‌కు ఫీజులు మారుతుంటాయి. ఎంచుకున్న క‌ళాశాల,  కోర్సుకు ఉన్న డిమాండ్‌, ద్రవ్యోల్బణం వంటి వాటికి అనుగుణంగా ఫీజులు మారే అవ‌కాశం ఉంది. 15 సంవ‌త్సరాల తర్వాత ఉన్నత విద్యా ఖర్చుల అంచ‌నాలు మాత్రమే ఇచ్చాం.. కచ్చితంగా అంతే ఉంటాయని చెప్పలేం. కాబ‌ట్టి మీ అమ్మాయి భ‌విష్యత్‌ విద్యా అవసరాలను అంచనా వేసి అందుకు తగినట్లు మదుపు చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని