చిన్న రైతుల కోసం ఐటీసీ నుంచి సూపర్‌ యాప్‌

ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ చిన్న రైతుల కోసం ఈ ఏడాది ఒక సూపర్‌ యాప్‌ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐటీసీ మార్స్‌ లేదా ‘మెటామార్కెట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ అగ్రికల్చర్‌

Published : 12 Aug 2021 01:07 IST

ఆంధ్రప్రదేశ్‌లో పైలట్‌ ప్రాజెక్టులు

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ చిన్న రైతుల కోసం ఈ ఏడాది ఒక సూపర్‌ యాప్‌ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐటీసీ మార్స్‌ లేదా ‘మెటామార్కెట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ సర్వీసెస్‌’ పేరుతో వస్తున్న ఈ యాప్‌ వల్ల ఐటీసీ ఇ-చౌపల్‌కు కొత్త రెక్కలు వస్తాయని, రైతులకు అవాంతరాలు లేని సేవలను అందించే ‘ఫిజిటల్‌’ వ్యవస్థ రూపొందుతుందని ఐటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ పురి పేర్కొన్నారు. ‘ఐటీసీ-మార్స్‌ పలు వ్యవసాయ సేవలను అందిస్తుంది. ఈ యాప్‌కున్న సూక్ష్మ-సేవల నిర్మాణం వల్ల పలు వ్యవసాయ సాంకేతిక సొల్యూషన్లు లభిస్తాయి. ఇందులో హైపర్‌లోకల్‌ సేవలు, ఏఐ ఆధారిత సలహాలు, ఆన్‌లైన్‌ మార్కెట్‌లుంటాయి. ఇప్పటికే కంపెనీ ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దీనిపై కొన్ని పైలట్‌ ప్రాజెక్టులు(మిరప వేల్యూ చైన్‌పై) జరుగుతున్నాయి. దీనివల్ల ప్రస్తుత సీజనులో అదనంగా 26 శాతం ఆదాయం రైతులకు వచ్చే అవకాశం ఉంద’ని ఆయన వివరించారు.


లెన్స్‌కార్ట్‌ 2000 నియామకాలు

దిల్లీ: కళ్లజోడు బ్రాండ్‌ లెన్స్‌కార్ట్‌ విస్తరణ బాట పట్టింది. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశవ్యాప్తంగా 2000 మంది పైగా ఉద్యోగులను చేర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. మరో 300 మంది ఉద్యోగుల నియామకాలతో సింగపూర్‌, పశ్చిమాసియా, అమెరికాల్లో అంతర్జాతీయ బృందాలను విస్తరించాలని భావిస్తోంది. టెక్‌, డేటా సైన్స్‌ బృందం విభాగాల్లో డేటా సైంటిస్టులు, బిజినెస్‌ అనలిస్టులు, డేటా ఇంజినీర్లు, నిపుణుల కొలువుల భర్తీపై దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. విక్రయశాలలను పెంచి వాటి నిర్వహణ కోసం ఇంకో 1500 మంది రిటైల్‌ ఉద్యోగులను కంపెనీ నియమించనుంది. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్‌ల్లోని టెక్నాలజీ బృందాల్లో 100 మందికి పైగా ఇంజినీర్లను నియమించుకోనుంది. సరఫరా వ్యవస్థ, తయారీ కార్యకలాపాల్లో 300కు పైగా ఉద్యోగులు చేరనున్నారు. ఫైనాన్స్‌, వినియోగదారు వ్యవహారాలు, మానవ వనరులు, మర్చండైజింగ్‌ల్లో కార్పొరేట్‌ పనులకు 100 మందిని నియమించుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని