Reliance-Future Vs Amazon: ‘రిలయన్స్‌-ఫ్యూచర్‌’ ఒప్పందంలో అమెజాన్‌కు ఊరట!

రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ విలీనాన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ విషయంలో అమెజాన్‌కు అనుకూల తీర్పు వెలువడింది....

Updated : 06 Aug 2021 12:15 IST

సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పునకు కట్టుబడాల్సిందేనన్న సుప్రీం

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ విలీనాన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ విషయంలో అమెజాన్‌కు అనుకూల తీర్పు వెలువడింది. రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు జారీ చేసిన ఆదేశాలు భారత్‌లో చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నేపథ్యం ఇదీ..

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదించింది. సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. ఆ కోర్టు డీల్‌పై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.

కానీ, విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు భారత్‌లో చెల్లుబాటు కావని ఫ్యూచర్‌ గ్రూప్ వాదిస్తూ వచ్చింది. దీంతో మధ్యర్తిత్వ కోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అమెజాన్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం తొలుత అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ఫ్యూచర్‌ గ్రూప్ అదే కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం మునుపటి తీర్పును తిరగరాస్తూ.. ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.

దిల్లీ హైకోర్టు తదుపరి తీర్పుతో సంతృప్తి చెందని అమెజాన్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం జులై 29న తీర్పును రిజర్వ్‌ చేసి.. నేడు అమెజాన్‌కు అనుకూలంగా వెలువరించింది. మరోవైపు ఈ వివాదంపై విచారణను ‘ది సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ)’ గత నెలలో పూర్తి చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ హరీశ్‌ సాల్వే, అమెజాన్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ గోపాల్‌ సుబ్రమణియమ్‌ వాదించారు. ఈ నెలలో దీనిపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని