స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

నిర్ధారించిన పరిమితికి మించి బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ముని ఫిక్స్డ్ డిపాజిట్గా మళ్ళింఛి అదనపు రాబడి అందించే స్వీప్ ఇన్ ఖాతా వివరాలు..

Published : 15 Dec 2020 21:31 IST

సాధారణంగా తక్షణ అవసరాల నిమిత్తం బ్యాంక్‌ పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తాలను నిల్వ చేస్తూంటాం. ఇందులో ఉన్న సొమ్ముకు వార్షిక వడ్డీ రేటు 4 శాతంగానే ఉంటుంది. అలా కాకుండా మనం ఒక పరిమితిని మించి వాడుకోని డబ్బును ప్రత్యేక  సదుపాయం ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు మళ్లించొచ్చు.  ఈ రకమైన ఖాతాను స్వీప్ ఇన్ అకౌంట్ అంటారు.  ఈ పరిమితి కేటాయింపును త్రెషోల్డ్‌ లిమిట్‌ అంటారు.  త్రెషోల్డ్‌ లిమిట్‌ కంటే ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంటే అది వెంటనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలోకి మారుతుంది. దీని వల్ల ఖాతాలో స్తబ్దుగా ఉండే కన్నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా కాస్త ఎక్కువ వడ్డీని  పొందవచ్చు.  ఒకవేళ  ఏదైనా అత్యవసరంలో త్రెషోల్డ్‌ లిమిట్ కంటే ఎక్కువగా విత్‌డ్రా చేస్తే అందుకు తగినట్లుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లోని సొమ్ము పొదుపు ఖాతాలోకి జమ అవుతుంది.

కొన్ని రోజుల నుంచి మొదలుకొని 5 సంవత్సరాల వరకూ స్వీప్‌ ఇన్‌ ద్వారా జమయ్యే డబ్బు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలో ఉంటుంది. ఖాతాలో కనీస నిల్వ బ్యాంకు పొదుపు ఖాతా తెరచినప్పుడు ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.  త్రెషోల్డ్‌ లిమిట్‌లోనే కనీస నిల్వ మొత్తం ఒక భాగంగా ఉంటుంది.

ఉదాహరణకు

  • మీ ఖాతాలో రూ. 60వేలు ఉంది అనుకుందాం. కనీస నిల్వ రూ. 5వేలు, త్రెషోల్డ్‌ లిమిట్‌ రూ. 20వేలు అయితే రూ.40వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలోకి మారుతుంది. మిగిలిన రూ. 20 వేలు మీ ఖాతాలో అందుబాటులో ఉంటుంది.
  • ఇప్పుడు ఖాతాలో నుంచి రూ. 25 వేలు విత్‌డ్రా చేస్తే కనీస నిల్వ రూ. 5వేలు పోనూ ఖాతాలో రూ. 15 వేలు మాత్రమే ఉంది. అప్పుడు రూ. 40వేలలో నుంచి రూ. 10 వేలు ఖాతాలో జమ అవుతుంది.
  • మిగిలిన రూ.30వేలకు మిగిలిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కాలానికి పూర్తిగా వడ్డీ వస్తుంది. రూ. 10 వేలకు మాత్రం సంపూర్ణంగా వడ్డీ రాదు.

అదనపు రాబడి ఎలా అంటే

  • మీ పొదుపు ఖాతాలో ఒక సంవత్సరం పాటు లక్ష రూపాయలు ఉందనుకుందాం. 4 శాతం వడ్డీ ఉంటే అందుకు గాను మీరు అందుకునే వడ్డీ రూ. 4 వేలు.
  • అదే మీకు ఆటో స్వీప్‌ సౌకర్యం ఉంటే, త్రెషోల్డ్‌ లిమిట్‌ రూ. 10వేలు అయితే రూ. 90 వేలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు 8 శాతం వడ్డీ వర్తిస్తే రూ. 7200 వస్తుంది. మిగిలిన రూ. 10 వేలకు 4 శాతం వడ్డీ చొప్పున రూ. 400 వడ్డీ వస్తుంది. మొదటి సందర్భంలో వడ్డీ ద్వారా వచ్చే అదనపు ఆదాయం రూ. 4 వేలు కాగా రెండో సందర్భంలో రూ. 7600లు వస్తుంది. అదనంగా రూ. 3600 ప్రయోజనం కలుగుతుంది.
  • ఒకవేళ పెద్దమొత్తంలో చెక్కు జారీ చేసేటప్పుడు మామూలు పొదుపు ఖాతాలో నుంచి డ్రా చేసినట్లే  ఖాతాలో నుంచి మినహాయిస్తారు.

ఈ సదుపాయం కోరుకునేముందు గమనించాల్సిన  అంశాలు

  • ఆటో స్వీప్‌ సదుపాయం కోసం కొన్ని బ్యాంకులు కనీస కాల పరిమితిని నిర్ణయిస్తాయి.
  • త్రెషోల్డ్‌ లిమిట్‌ను దాటి ఖాతాలో డబ్బును విత్‌ డ్రా చేసుకుంటే రివర్స్‌ స్వీప్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లోని సొమ్ము పొదుపు ఖాతాలోకి బదిలీ అవుతుంది.
  • సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేట్లే వీటికి ఉంటాయి. అయితే అది ఎన్ని రోజులకు లెక్కిస్తున్నారో గమనించాలి.

ఆటో స్వీప్‌లో ఉండే పరిమితులు

  • కొన్ని బ్యాంకులు ఆటో స్వీప్‌ ద్వారా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు కనీస కాలవ్యవధిని నిర్ణయిస్తాయి.
  • సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చక్ర వడ్డీ ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు స్వీప్‌ ఇన్‌ ద్వారా చేసిన వాటికి సాధారణ వడ్డీనే అమలు చేస్తున్నాయి.

ఖాతాలో సొమ్ము నిరుపయోగంగా ఉండే దాని కన్నా ఆటో స్వీప్‌ సౌకర్యం ఉండడం చాలా మంచిది. మీకు కావాల్సిన సమయంలో డబ్బును వెనక్కు తీసుకొనే వెసులుబాటూ ఉంటుంది. మరో వైపు సొమ్ము ఉంచిన కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు అమలయ్యే వడ్డీని పొందవచ్చు. పొదుపు ఖాతాలో సొమ్ము వృథాగా ఉండి పోతుంది అనుకునేవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ప్రయోజనకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని