ప‌న్ను లేకుండా ఫండ్ల‌ను మార్చుకోవ‌చ్చు

యులిప్, ఎన్‌పీఎస్‌లో ఫండ్ ప‌నితీరు న‌చ్చ‌క‌పోతే ఎలాంటి ఛార్జీలు లేకుండా పెట్టుబ‌డుల‌ను మార్చుకొని లాభాల‌ను పొంద‌వ‌చ్చు.​​​​​​....​

Published : 19 Dec 2020 14:15 IST

యులిప్, ఎన్‌పీఎస్‌లో ఫండ్ ప‌నితీరు న‌చ్చ‌క‌పోతే ఎలాంటి ఛార్జీలు లేకుండా పెట్టుబ‌డుల‌ను మార్చుకొని లాభాల‌ను పొంద‌వ‌చ్చు.​​​​​​​

యులిప్స్ బీమా క‌వ‌ర్‌ కూడా క‌లిగి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. దీనిపై రాబ‌డి మార్కెట్ ఆధారంగా ఉంటుంది. ఫండ్ల కేటాయింపుల‌ను కూడా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మార్చుకునే అవ‌కాశం ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో కూడా అదేవిధంగా పెట్టుబ‌డుల్లో మార్పులు చేస్తే ఎలాంటి ప‌న్ను ఉండ‌దు.

యులిప్స్‌:

యులిప్ కొనుగోలు చేసిన‌ప్పుడు పాల‌సీ ఆఫ‌ర్ చేసిన ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను కేటాయించ‌వ‌ల‌సి ఉంటుంది. ఫండ్ ప‌నితీరు న‌చ్చ‌క‌పోతే ఇత‌ర ఫండ్‌కు మార్చుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే ఆ యులిప్ ఆఫ‌ర్ చేసిన ఫండ్ల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డుల‌ను స‌వ‌రించుకోవాలి. ఇత‌ర బీమా సంస్థ‌ల‌కు లేదా యులిప్ ఆఫ‌ర్ చేయ‌ని మ‌రో ఫండ్‌కు గానీ మార్చుకునేందుకు వీలుండ‌దు. అలా చేయాల‌నుకుంటే పాల‌సీని నిలిపివేసి తిరిగి పెట్టుబ‌డులు చేయాల్సి ఉంటుంది. చాలా వ‌ర‌కు కంపెనీలు ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను మార్చుకునేందుకు ఏడాదికి కొంత ప‌రిమితిని విధిస్తాయి. ఆ త‌ర్వాత‌ కొంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూ.100 నుంచి రూ.500 వ‌ర‌కు ఉండొచ్చు.

ఆన్‌లైన్‌లో యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ద్వారా పెట్టుబ‌డుల‌ను మార్చుకునే అవ‌కాశం ఉంది లేదా బీమా సంస్థ‌ను సంప్ర‌దించి ఒక‌ ఫారం పూర్తి చేయ‌డం ద్వారా ఈ మార్పులు చేసుకోవ‌చ్చు. అందులో ఇప్పుడు ఏ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు ఉన్నాయి త‌ర్వాత ఏ ఫండ్‌కి మారాల‌నుకుంటున్నారు ఎంత అనేది స‌మాచారం అందించాల్సి ఉంటుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల లోపు ఈ ఫారంను అంద‌జేస్తే అదే రోజు ఫండ్ విలువ‌ను బ‌ట్టి బీమా సంస్థ అందిస్తుంది లేదంటే మ‌రుస‌టి రోజు విలువ‌ను లెక్కిస్తుంది.

ఎన్‌పీఎస్‌:

ఎన్‌పీఎస్ లో నాలుగు ర‌కాల‌ ఫండ్లు ఉంటాయి. అవి ఈక్విటీ ఫండ్, ప్ర‌భుత్వ సెక్యూరిటీస్ ఫండ్, కార్పొరేట్ బాండ్ ఫండ్, ఆల్ట‌ర్నేటివ్ అసెట్‌క్లాస్ ఫండ్. ఈక్విటీల‌లో 75 శాతం కంటే ఎక్కువ పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉండ‌దు. అదేవిధంగా ల్ట‌ర్నేటివ్ అసెట్‌క్లాస్ ఫండ్‌లో కూడా 5 శాతం కంటే ఎక్కువ పెట్టుబ‌డుల‌కు వీల్లేదు. ఎన్‌పీఎస్‌ను 8 ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తారు. ఆయా సంస్థ‌లు ఆఫ‌ర్ చేసే ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో మీరు ఫండ్ మేనేజ‌ర్‌ను ఒక‌సారి, ఫండ్ల‌ను రెండుసార్లు మార్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు 75 శ‌తం కంటే ఎక్కువ ఈక్విటీల‌కు కేటాయించ‌లేరు. కానీ మొత్తం ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌లో పూర్తిగా పెట్ట‌వ‌చ్చు. ఆన్లైన్ ద్వారా అయితే ఎలాంటి రుసుములు లేకుండా సుల‌భంగా ప‌ని పూర్త‌వుతుంది. ఆఫ్‌లైన్‌లో అయితే రూ.20 వ‌ర‌కు ఛార్జీ ప‌డుతుంది. ఫండ్ల‌ను మార్చుకోవాల‌నుకున్న‌ప్పుడు మీరు ప్ర‌తిపాదించిన త‌ర్వాత మొంద‌ట‌ సెంట్ర‌ల్ రికార్డ్ ఏజెన్సీకి, ఆ త‌ర్వాత ఫండ్ మేనేజ‌ర్ వ‌ద్ద‌కు వెళ్తుంది. అంటే మొత్తం ప‌ని పూర్త‌య్యేస‌రికి 2-3 రోజులు ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని