ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను అప్‌డేట్ చేసుకోండి..కెన‌రాబ్యాంక్‌

సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్‌ల‌కు సంబంధించిన పాత‌ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు జూన్ 30 త‌రువాత పనిచేయ‌వు. ఈ లోపే అప్‌డేట్ చేసుకోవాల‌ని కెన‌రా బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌జేసింది. 

Updated : 26 May 2021 10:07 IST

కెన‌రాబ్యాంక్‌లో విలీనమైన నేప‌థ్యంలో సిండికేట్ బ్యాంక్ సంబంధిత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు జులై1,2021 నుంచి మారుతున్నాయ‌ని కెన‌రా బ్యాంక్ త‌మ వినియోగ‌దారుల‌కు తెలియ‌జేసింది. అందువ‌ల్ల సిండికేట్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు త‌మ పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివ‌రాల‌ను జూన్ 30 తేది లోపుగా అప్‌డేట్ చేసుకోవాల‌ని తెలిపింది. 

గ‌త సంవ‌త్స‌రంలో సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకుతో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 'ఎస్‌వైఎన్‌బి'తో ప్రారంభ‌మ‌య్యే అన్ని ఇ-సిండికేట్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారాయి. 'ఎస్‌వైఎన్‌బి'తో ప్రారంభ‌మ‌య్యే అన్ని ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను జులై1,2021 నుంచి నిలిపివేయ‌నున్న‌ట్లు కెన‌రా బ్యాంక్ తెలిపింది. 

నెఫ్ట్‌/ ఆర్‌టీజీఎస్‌/ఐఎమ్‌పీఎస్ ద్వారా డ‌బ్బు పంపించేప్పుడు "సీఎన్ఆర్‌బీ"తో ప్రారంభ‌మ‌య్యే కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను ఉప‌యోగించాలి. ఈ స‌మాచారాన్ని బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు డ‌బ్బు పంపేవారికి తెలియ‌జేయాలి అని బ్యాంక్ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అంటే ఏమిటి?
ఐఎఫ్ఎస్‌సీ (ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11-అంకెల ఆల్ఫాన్యూమరిక్(ఆంగ్ల అక్ష‌రాలు అంకెల‌తో మిళిత‌మైన‌) కోడ్, ఇది నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎమ్‌పీఎస్ ద్వారా జరిగే ఆన్‌లైన్ ఫండ్ బదిలీ లావాదేవీలకు ఉపయోగించబడుతుంది.

ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు ఎందుకు మారుతున్నాయి?
మెగా విలీన ప్ర‌క్రియ‌లో భాగంగా10 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్న‌ట్లు 2019లో కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క్రియ ఇప్ప‌టికే పూర్తయ్యింది. అయితే ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1,2021 నుంచి ఐఎఫ్ఎస్‌సీ, ఎమ్ఐసీఆర్ కోడ్‌లను కూడా బ్యాంకులు అప్‌డేట్ చేయ‌డం ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేష‌న్ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతున్నాయ‌ని, కొత్త కోడ్‌ల‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. త్వ‌ర‌లోనే మిగిలిన విలీనం అయిన మిగిలిన బ్యాంకుల కోడ్‌లు మారుతాయి.అయితే బ్యాంకులు ప్ర‌క‌టించేవ‌ర‌కు పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌నే వినియోగ‌దారులు ఉప‌యోగించుకోవ‌చ్చు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని