టీసీఎస్‌ కొత్త బ్రాండ్‌ నినాదం

భారత్‌లో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సరికొత్త బ్రాండ్‌ నినాదం ‘బిల్డింగ్‌ ఆన్‌ బిలీఫ్‌’ (విశ్వాసమే పునాదులుగా)ను ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ‘ఎక్స్‌పీరియెన్స్‌

Published : 31 Mar 2021 00:36 IST

దిల్లీ: భారత్‌లో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సరికొత్త బ్రాండ్‌ నినాదం ‘బిల్డింగ్‌ ఆన్‌ బిలీఫ్‌’ (విశ్వాసమే పునాదులుగా)ను ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ‘ఎక్స్‌పీరియెన్స్‌ సెర్టినిటీ’ నినాదాన్ని సంస్థ మార్చింది. ఖాతాదారులు కోరుకున్న పనిని సాకారం చేసేందుకు తోడ్పాటు అందిస్తామని టీసీఎస్‌ వెల్లడించింది. కొత్త నినాదం కోసం ఏడాదికి పైగా పరిశోధన చేశామని, ఖాతాదారులు, అసోసియేట్ల నుంచి అభిప్రాయాలు సేకరించామని కంపెనీ తెలిపింది. కొన్ని దశాబ్దాలుగా వినూత్నత, పరిజ్ఞానం, టెక్నాలజీ అందిస్తూ మా ఖాతాదారులతో విజయవంతంగా ముందుకెళ్తున్నామని టీసీఎస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి రాజశ్రీ తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో కొత్త బ్రాండ్‌ నినాదాన్ని కంపెనీ ప్రచారం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ తోడ్పాటు ఇస్తున్న పలు మారధాన్‌లలో ఈ నినాదాన్ని ఉంచనుంది. ప్రపంచంలోని అత్యుత్తమ మూడు ఐటీ సేవల బ్రాండ్‌లలో టీసీఎస్‌ ఒకటని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ప్రకటించిన సంగతి విదితమే. 2010-20 దశాబ్దంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా సైతం నిలిచింది. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో టీసీఎస్‌ సూపర్‌బ్రాండ్‌ గుర్తింపు పొందింది.


విస్తారాలో వేతన కోతలు ఆగాయ్‌

ముంబయి: విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్‌ గత ఏడాది ప్రకటించిన వేతన కోతలను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొన్ని విభాగాల ఉద్యోగులకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనాలు అందుతాయని సిబ్బందికి ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజ్‌మెంట్‌ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రం వేతన కోత కొనసాగుతుందని పేర్కొంది. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త సంస్థే ఇంది. గత జూన్‌లో మొత్తం సిబ్బందికి సుమారు 40 శాతం వరకు వేతన కోతల్ని ప్రకటించి, ఈ ఏడాది మార్చి వరకు కొనసాగించింది. ‘స్థాయి-1 నుంచి స్థాయి-3 సిబ్బందికి ఏప్రిల్‌ 1 నుంచి వేతన కోత నిలిపివేసేందుకు మా బోర్డు ఆమోదం తెలిపింది. స్థాయి-4, స్థాయి-5 ఉద్యోగులకు 15 శాతం, నా వేతనంలో 25% వేతన కోత అమలవుతుంద’ని విస్తారా సీఈఓ లెస్లీ వెల్లడించారు.
సంక్షిప్తంగా
* ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ.3000 కోట్ల క్యూఐపీ ఇష్యూకు కనీస ధరను రూ.60.34గా నిర్ణయించారు.
* ఒడిశా, రాజస్థాన్‌ల్లో తమ నిర్మాణ సంస్థ ‘చెప్పుకోదగ్గ’ కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. కంపెనీ రూ.1000- 2500 కోట్ల కాంట్రాక్టులను చెప్పుకోదగ్గ వాటిగా పరిగణిస్తుంది. ఇందులో బిహార్‌లో గంగా నదిపై బ్రిడ్జ్‌ నిర్మాణ కాంట్రాక్టు కూడా ఉంది.
* గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌కు 60 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేసే ఆర్డర్లును టాటా పవర్‌ దక్కించుకుంది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి త్రైమాసికంలో 13 శాతం రిటైల్‌ విక్రయశాలలను పెంచుకోనున్నట్లు కల్యాణ్‌ జువెలర్స్‌ తెలిపింది. ఏప్రిల్‌ 24న సంస్థ 14 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనుంది. హైదరాబాద్‌, ఖమ్మం, కరీమ్‌నగర్‌లలోనూ సంస్థ కొత్త షోరూమ్‌లు నెలకొల్పనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని