పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ ఉపసంహరణ‌పై టీడీఎస్ ఎప్పుడు వ‌ర్తిస్తుంది?

మునుపటి 3 సంవత్సరాలలో ఆ వ్యక్తి ఐటీఆర్‌ని  దాఖలు చేయకపోతే 2-5 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Updated : 07 Apr 2021 14:56 IST

పన్ను చెల్లించ‌కుండా త‌ప్పించుకునే వారిని, ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేయని వారిని గుర్తించడానికి పన్ను శాఖ డేటాను సేకరిస్తోంది. ఇదే లక్ష్యాన్ని సాధించడానికి, గత ఏడాది జూలై నెలలో ఆదాయపు పన్ను చట్టం కింద ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194 ఎన్ ప్రకారం, ఒక వ్యక్తి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), పోస్టాఫీసు డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్, జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (ఎన్ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాల నుంచి నగదు ఉపసంహరించుకుంటే,  టీడీఎస్‌ చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. మునుపటి 3 సంవత్సరాలలో ఆ వ్యక్తి ఐటీఆర్‌ని  దాఖలు చేయకపోతే 2-5 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

పీపీఎఫ్‌తో సహా అన్ని పోస్టాఫీసు పథకాల నుంచి ఒక వ్యక్తి రూ. 20 లక్షల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఉపసంహరించుకుంటే, సెక్ష‌న్ 194ఎన్ ప్ర‌కారం,   టీడీఎస్‌ మొత్తం 2 శాతం ఉంటుంది. అదే మునుపటి మూడు మ‌దింపు సంవత్సరాల్లో ఆ వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్‌) దాఖలు చేయకపోతే, ఉప‌సంహ‌ర‌ణ‌ మొత్తం రూ. కోటి దాటితే  5 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది. రేట్ల పరిమితులు నగదు ఉపసంహరించుకునే వ్యక్తి మునుప‌టి మూడు సంవ‌త్స‌రాల్లో ఐటిఆర్ గ‌డువు లోపు దాఖలు చేశారా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

మూడు అసెస్‌మెంట్ సంవత్సరాల్లో ఎప్పుడైనా ఐటిఆర్ దాఖలు చేసి ఉంటే, అప్పుడు సంవత్సరంలో రూ.కోటి  వరకు ఉపసంహరణకు టీడీఎస్ ఉండ‌దు. అదేవిధంగా ఏడాదికి నగదు ఉపసంహరణ రూ.కోటి దాటినా టీడీఎస్ 2 శాతమే వ‌ర్తిస్తుంది. ఈ టీడీఎస్‌ నిబంధనలు బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు తపాలా కార్యాలయాల నుంచి నగదు ఉపసంహరణపై కూడా వర్తిస్తాయి. మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందని ఫారం 15 హెచ్ / జి సమర్పించిన‌ప్ప‌టికీ ఈ టీడీఎస్ వ‌ర్తిస్తుంది. 
 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts