Published : 17 Dec 2020 13:24 IST

తొలి అడుగే క‌ష్టం.. ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

మ‌నం బ‌రువు త‌గ్గాల‌నో, ఫిట్‌గా ఉండాల‌నో గ‌ట్టిగా నిశ్చ‌యించుకొని తెల్ల‌వారుజామునే వ్యాయామం లాంటివి మొద‌లుపెట్టాల‌నుకుంటాం. అందుకోసం మంచి స్పోర్ట్స్ వేర్‌, ర‌న్నింగ్ షూస్‌, వాట‌ర్ బాటిల్ కొనిపెట్టుకుంటాం. నెల‌లో మొద‌టి తారీఖు లేదా సోమ‌వారం తెల్ల‌వారుజాము నుంచి క‌స‌రత్తు మొద‌లు పెడ‌దామ‌నుకుంటాం. ఉద‌యం 5గంట‌ల‌కే అలారం పెట్టుకుంటాం. తీరా అలారం మోగాక‌… నాకు నిద్ర వ‌స్తోంది. స‌రిగ్గా నిద్ర‌పోక‌పోతే రోజంతా తాజాగా ఉండ‌లేను అని స‌ర్ది చెప్పుకొని ముసుగుత‌న్ని మ‌ళ్లీ నిద్ర‌పోతాం. లేచేస‌రికి టైమ్ 8 గంట‌లు. హ‌డావిడిగా లేచి స్నానం చేసి ఆఫీసుల‌కు బ‌య‌లుదేరుతాం. అప్పుడు ప్లాన్ చేసిందంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది!

చాలా మందికి తొలి అడుగు వేయ‌డ‌మే క‌ష్టం. ఆర్థిక నిర్వ‌హ‌ణ‌కూ ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. ఆర్థిక ప్ర‌ణాళిక రూపొందించ‌డం వ‌ర‌కు బాగానే చేసినా దాన్ని అమ‌లుప‌రిచేందుకు ర‌క‌ర‌కాల సాకులు వెతుక్కుంటారు. మంచి త‌రుణం మించిన రాదు… మంచి ప‌ని చేసేందుకు ఏదైనా మంచి రోజే. మ‌దుపు ప్రారంభించాలంటే బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో డ‌బ్బు ఉండాల‌ని, వేత‌నం వ‌చ్చేదాకా ఆగాల‌ని, మార్కెట్లు అధిక స్థాయుల వ‌ద్ద ఉన్నందుకు ఇప్పుడు క‌ష్టం అని మీర‌నుకోవ‌చ్చు. నిజం చెప్పాలంటే పొదుపు ప్రారంభించ‌క‌పోవ‌డానికంటే … మొద‌లుపెట్ట‌డానికే ఎక్కువ కార‌ణాలున్నాయి. ఎంత చిన్న వ‌య‌సులో పొదుపు ప్రారంభిస్తే అంత గొప్ప ప్ర‌యోజ‌నం… మంచి ఇంటిని కొనుగోలు చేయొచ్చు, నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకోవ‌చ్చు, ప్ర‌పంచాన్ని చుట్టిరావొచ్చు, ప‌ద‌వీ విర‌మ‌ణ నిశ్చింత‌గా చేసుకోవ‌చ్చు, పెద్ద మొత్తంలో డ‌బ్బు జ‌మ‌చేసి సొంతంగా వ్యాపారం మొద‌లుపెట్ట‌వ‌చ్చు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మొద‌ట బ్యాంకు ఖాతాలో ఎంత డ‌బ్బు ఉందో చూసుకోండి. ఒక వేళ ఏమీ లేక‌పోతే ఎందుకు పొదుపు చేయ‌లేక‌పోయారో ఆలోచించండి. ఆదాయం క‌న్నా ఖ‌ర్చులే ఎక్కువున్నాయా? దీనికి ప‌రిష్కారం ఆలోచించాల్సిందే. పొదుపు అవ్వాలి అల‌వాటు…తొలి అడుగులో భాగంగా… పొదుపు చేయ‌డం మొద‌లుపెట్టాలి. ఉద్యోగులైతే మీ నెల‌వారీ ఆదాయ‌మెంతో మీకు తెలుసు. దీంట్లోంచి ఎంత పొదుపు చేయాలి? దీనికి క‌చ్చిత‌మైన స‌మాధానం చెప్ప‌లేం. ఐతే నెల‌వారీ ఆదాయం నుంచి క‌నీసం 10శాతం పొదుపు చేయ‌వ‌చ్చు. ఏ ర‌కంగాను డ‌బ్బు మిగిల్చుకోలేక‌పోతున్నాం అంటే ఒకసారి ఖ‌ర్చుల‌ను నిశితంగా గ‌మ‌నించాలి. దేని కోసం ఖ‌ర్చు త‌గ్గించ‌గ‌ల‌మో ప‌రిశీలించాలి. జీతం వ‌చ్చీరాగానే 10శాతం ప‌క్క‌న పెట్టేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీకు రూ.50వేలు వ‌స్తుంద‌నుకుందాం. దీంట్లో 10శాతం అంటే రూ.5వేలు మ‌న‌ది కాద‌నుకోవాలి. ఇలా నెల‌కు రూ.5వేలు జ‌మ‌చేసినా ఏడాది తిరిగేస‌రికల్లా రూ.60వేలు చేతిలో ఉంటాయి. వీటిపై ఇంకా వ‌డ్డీ లెక్కించ‌కుండానే ఇంత మొత్తం వ‌స్తుంది. ఈ డ‌బ్బును పొదుపు ఖాతాలో అలాగే ఉంచాలి లేదా ఖ‌ర్చు పెడ‌తామ‌నే భ‌యం ఉంటే కొత్త బ్యాంకు ఖాతా తెరిచి దాంట్లో జ‌మ‌చేస్తూ ఉండాలి. మొద‌ట పొదుపు చేయ‌డం అల‌వ‌డితే నిదానంగా పెట్టుబ‌డులు పెట్ట‌గ‌లుగుతాం. ఏదైనా చిన్న‌పాటి ల‌క్ష్యం పెట్టుకోవాలి. కారు, ఫోన్ కొన‌డ‌మో లేదా ఏడాదిలో రూ.ల‌క్ష జ‌మ‌చేయాలి అనే ల‌క్ష్యంతో పొదుపు ప్రారంభిస్తే అదే అల‌వాటుగా మారిపోతుంది.

అల‌వాటు పెట్టుబ‌డికి దారితీయాలి…పొద‌పు చేయడాన్ని అల‌వాటు చేసుకున్నాక‌… త‌దుప‌రి పెట్టుబ‌డి ఆరంభించాలి. చాలా మందికి పొదుపు సుల‌భంగా అనిపిస్తుంది ఎటొచ్చీ పెట్టుబ‌డే క‌ష్టంగా అనిపిస్తుంది. ఈ ప‌రిస్థితుల్లో పెట్టుబ‌డి పథ‌కాల గురించి తెలుసుకోవ‌డం ముఖ్యం. తొలి సారి పెట్టుబ‌డులు చేస్తున్న‌ట్ట‌యితే రిక‌రింగ్ డిపాజిట్లతో చేయ‌డం మేలు. ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా రిక‌రింగ్ డిపాజిట్ ప్రారంభించి నెల‌నెలా కొంత జ‌మ‌చేయాలి. చాలా బ్యాంకులు నెట్‌బ్యాంకింగ్ ద్వారా సుల‌భంగా డిపాజిట్ చేసే ఐచ్ఛికాన్ని అందిస్తున్నాయి. దీని కోసం ప్ర‌త్యేకంగా బ్యాంకుకు వెళ్ల‌క్క‌ర్లేదు. ప్రారంభంలోనే మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో మొద‌లుపెట్టాలంటే అన్నేసి ర‌కాల‌ను చూసి అచ్చెరువొందొద్దు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి ప్రారంభించేందుకు తొలుత కొన్ని విధానాల‌ను పూర్తి చేయాలి ఆ త‌ర్వాత క్ర‌మేపీ పెట్టుబ‌డి చేయాలి. ఇప్పుడు ఆధార్ రావ‌డంతో ఇ-కేవైసీ మ‌రింత సుల‌భ‌మై వెన్వెంటే ప‌నులు జ‌రిగిపోతున్నాయి. తొలిసారి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టేవారు… తాము పొదుపు చేయ‌గ‌లిగే దాంట్లో 50శాతాన్ని సిప్ చేయ‌మంటారు. అంటే రూ.5వేలు పొదుపు చేయ‌గ‌లం అనుకోండి… దీంట్లో స‌గం అంటే రూ.2,500 మాత్ర‌మే సిప్ ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు.

కాస్త న‌మ్మ‌కం ఏర్పాడ‌క క్ర‌మంగా సిప్ మొత్తాల‌ను పెంచుతూ వెళ్ల‌డం మంచిది. తొలి నాళ్ల‌లో హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్ల ఎంపిక మేలు. ఆ త‌ర్వాత నిదానంగా ఈక్విటీ ఫండ్ల జోలికి వెళ్ల‌మంటున్నారు నిపుణులు. ల‌క్ష్యాలు ఏర్ప‌ర్చుకోండి - 20ల‌లో ఉండ‌గా కెరీర్ ప్రారంభంలో ఉంటాం. అప్పుడు ఇల్లు కొన‌డం, పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు డ‌బ్బు దాచుకోవ‌డం లాంటి పెద్ద పెద్ద ల‌క్ష్యాలు ఉండ‌వు. అలాంటప్పుడు సంప‌ద సృష్టించుకోవాల‌నే ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర్చుకొని స్ఫూర్తి ర‌గుల్చుకోండి. ప్ర‌స్తుతానికి ఎలాంటి ల‌క్ష్యాలు క‌ళ్ల ముందు క‌నిపించ‌క‌పోయినా భ‌విష్య‌త్లో నిర్దేశించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచే క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌ర్చుకోవాలి. ఇది అల‌వాటు చేసుకునేందుకు చిన్న చిన్న ల‌క్ష్యాల‌ను పెట్టుకోవాలి. ఇక ఆగ‌కండి… ప‌రుగు మొద‌లెట్టండి! బ్యాంకు ఖాతాలో నిల్వ ఉన్న‌దాంతోనే పొదుపు లేదా పెట్టుబ‌డి మొద‌లుపెట్టేయండి. ఏవిధంగా అయితే మంచి బ‌ట్ట‌లు తొడుక్కొని చూడ‌చ‌క్క‌గా క‌నిపిస్తామ‌ని న‌మ్మ‌కం ఏర్ప‌ర్చుకుంటామో అదే విధంగా పొదుపు అల‌వాటుతో భ‌విష్య‌త్ అందంగా అవుతుంద‌ని న‌మ్మ‌కంతో తొలి అడుగు వేద్దాం… ప‌రుగు మొద‌లుపెడ‌దాం!

(Source: livemint)

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts