1MGలో టాటా డిజిటల్‌ మెజార్టీ వాటా

Tata Digital: 1MGలో మెజార్టీ వాటాలను పొందనున్నట్లు టాటా డిజిటల్‌ ప్రకటించింది.

Published : 10 Jun 2021 21:52 IST

దిల్లీ: ఈ-కామర్స్‌ విభాగంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, రిలయన్స్‌ రిటైల్‌ సంస్థలతో పోటీ పడేందుకు టాటా సన్స్‌ కంపెనీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ సేవలు అందించే 1MG టెక్నాలజీస్‌లో టాటా సన్స్‌కు చెందిన టాటా డిజిటల్‌ మెజార్టీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలను మాత్రం పేర్కొనలేదు. ఫిట్‌నెస్‌ సంస్థ క్యూర్‌ఫిట్‌లో రూ.550 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన కొద్దిరోజులకే 1MGలో మెజార్టీ వాటా పొందేందుకు ముందుకు రావడం గమనార్హం.

కరోనా విజృంభణ తర్వాత ఈ-ఫార్మసీ, ఈ- డయాగ్నోస్టిక్స్‌, టెలీ కన్సల్టేషన్‌ విభాగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సేవలు మరింత విస్తరిస్తాయని టాటా డిజిటల్‌ పేర్కొంది. ఆ మేరకు నాణ్యమైన సేవలను వినియోగదారులు అందించేందుకు 1MGలో పెట్టుబడులు పెడుతున్నట్లు టాటా డిజిటల్‌ సీఈవో ప్రతీక్‌ పాల్‌ తెలిపారు. తమ సంస్థలో టాటాలు పెట్టుబడి పెట్టడం కంపెనీ ప్రయాణంలో ఓ మైలురాయి అని 1MG  సహ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రశాంత్‌ టాండన్‌ తెలిపారు.

2015లో ప్రారంభమైన 1MG.. ఈ-హెల్త్‌కేర్‌ విభాగంలో డయాగ్నోస్టిక్స్‌ సేవలు, టెలీ కన్సల్టేషన్‌ వంటి సేవలతో పాటు మందులను సరఫరా చేస్తోంది.  ప్రస్తుతం 1MGకి మూడు డయాగ్నస్టిక్‌ ల్యాబులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా తన సప్లయ్‌ చైన్‌ను విస్తరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని