Tata Group: సౌందర్య ఉత్పత్తుల రంగంపై మళ్లీ టాటాల దృష్టి!

సౌందర్య ఉత్పత్తుల రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడంపై భారత వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ కన్నేసింది...

Updated : 15 Dec 2021 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం వేగంగా పుంజుకుంటోంది. 2025 నాటికి ఈ రంగం మార్కెట్‌ విలువ 20 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2017లో 11 బిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు రెండింతల వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇటీవల స్టాక్ మార్కెట్‌లో నమోదై మదుపర్లకు లాభాల పంట పండించిన నైకా వంటి సంస్థలు ఈ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడంపై భారత వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ కన్నేసింది. 23 ఏళ్ల క్రితం సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి పుంజుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఫుట్‌వేర్‌, అండర్‌వేర్‌ విభాగంలో ట్రెంట్‌ లిమిటెడ్‌ పేరిట రిటైల్‌స్టోర్లను నిర్వహిస్తున్న టాటా గ్రూప్‌.. సౌందర్య ఉత్పత్తులనూ విక్రయించేందకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ట్రెంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా వెల్లడించారు.

లాక్మే పేరిట భారత్‌లో విశేష ఆదరణ పొందిన సౌందర్య ఉత్పత్తుల సంస్థను నోయెల్‌ టాటా తల్లి సిమోన్‌ టాటా 1953లో ప్రారంభించారు. భారత్‌లో ఇదే తొలి కాస్మొటిక్స్ కంపెనీ. 1998లో ఈ సంస్థను టాటా గ్రూప్‌ యూనీలివర్‌కు విక్రయించింది. ఒప్పందం ప్రకారం 10 ఏళ్ల పాటు టాటాలు ఈ రంగంలోకి ప్రవేశించొద్దు. ఆ గడువు ముగిసిన తర్వాత 2014లో తిరిగి ట్రెంట్‌ పేరిట తిరిగి ప్రవేశించింది. పెద్ద ఎత్తున స్టోర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ఛానెళ్లను విస్తరిస్తోంది. ప్రస్తుతం బ్యూటీ, ఫుట్‌వేర్‌, అండర్‌వేర్‌ సెగ్మెంట్ల మార్కెట్‌ విలువ భారత్‌లో 30 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంట్లో ట్రెంట్‌ కేవలం 100 మిలియన్ డాలర్ల మార్కెట్‌ను మాత్రమే ఆకర్షించగలిగింది. డిజిటల్‌ రంగంలో వస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ద్వారా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు నోయెల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని