Tata motors: పెరగనున్న వాహనాల ధరలు..!

టాటా మోటార్స్‌కు చెందిన వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే వాహనాల ధరలను పెంచేందుకు హోండా కార్స్‌ సైతం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

Updated : 05 Jul 2021 20:14 IST

దిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే తమ వాహన ధరలను పెంచేందుకు హోండా కార్స్‌ నిర్ణయం తీసుకుంది. తాజాగా టాటా మోటార్స్‌ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. తమ సంస్థకు చెందిన అన్ని రకాల కార్లు, ఎస్‌యూవీల ధరలు పెరుగుతాయని ఈ మేరకు టాటా మోటార్స్‌ సోమవారం వెల్లడించింది. అయితే ఎప్పటికి ధరలు పెరుగుతాయనే వివరాల్ని సంస్థ బహిర్గతం చేయలేదు. కానీ అతి త్వరలో పెరగొచ్చని సూచనప్రాయంగా చెప్పింది. ఉక్కు, అల్యూమినియం సహా వాహనాల తయారీలో వినియోగించే పలు లోహాల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో ఆ భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకోవాలని సంస్థ యోచిస్తోంది. అందులో భాగంగా వినియోగదారులకు ఆ ప్రభావాన్ని బదిలీ చేయాలనుకుంటోంది. దేశీయ విపణిలో టియాగో, నెక్సాన్‌, హారియర్‌ లాంటి మోడళ్లను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది. అయితే ఏయే మోడళ్లపై ఎంతమేర ధరలు పెంచాలనుకుంటోందో అతి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్టు సంస్థ తెలిపింది. గడిచిన కొన్ని నెలల్లో ఉక్కు ధరలు క్రమంగా పెరిగాయి. రోడియం, పెల్లాడియం ధరలు దాదాపుగా రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మారుతి సుజుకి ఇండియా కూడా సెప్టెంబరు త్రైమాసికం నాటికి ధరలు పెంచనున్నట్టు జూన్‌లోనే ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని