Tata Motors: టాటా మోటార్స్ షేర్‌ హోల్డర్లకు కనక వర్షం!

టాటా మోటార్స్ షేర్‌ హోల్డర్లకు ఈరోజు సిరుల వర్షం కురుస్తోంది. ఈ స్టాక్‌ ధర ఈరోజు ఏకంగా 22 శాతానికి పైగా పెరిగి 523 వద్ద గరిష్ఠాన్ని తాకింది....

Updated : 13 Oct 2021 15:54 IST

ఒక్క సెషన్‌లో షేరు ధర 22శాతం వృద్ధి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా మోటార్స్ షేర్‌ హోల్డర్లకు ఈరోజు కనక వర్షం కురిసింది. ఈ స్టాక్‌ ధర ఈరోజు ఓ దశలో ఏకంగా 22 శాతానికి పైగా పెరిగి రూ.523 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. దీంతో మదుపర్లకు లాభాల పంట పండింది. టాటా మోటార్స్‌ విద్యుత్తు వాహన విభాగంలోకి టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7500 కోట్లు) సమీకరించడమే ఇందుకు కారణం. ఉదయం ఈ స్టాక్ రూ.462 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. చివరకు 21.11 శాతం లాభంతో రూ.509.70 వద్ద ముగిసింది. ఏడాది క్రితం రూ.126 వద్ద ట్రేడైన ఈ షేరు.. ఏకంగా 415 శాతం ఎగబాకడం విశేషం. గత మూడు రోజుల్లోనే ఈ స్టాక్‌ విలువ 46 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.81 లక్షల కోట్లకు చేరింది. 

ఇవీ కారణాలు...

భారత్‌లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రంగంలో వచ్చే అవకాశాలను టాటా మోటార్స్‌ వేగంగా అందిపుచ్చుకుంటుండడంతో మదుపర్లకు కంపెనీపై విశ్వాసం పెరిగింది. భారత్‌లో వేగంగా పురోగతి సాధిస్తున్న విద్యుత్తు వాహన కంపెనీల్లో టాటా మోటార్స్‌ ముందుంది. ఒక్క వాహన తయారీకే పరిమితం కాకుండా.. బ్యాటరీలు, ఛార్జింగ్‌ వసతులతో పాటు విద్యుత్తు వాహన రంగానికి కావాల్సిన ఇతర సదుపాయాల కల్పన విషయంలోనూ టాటా మోటార్స్‌ పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పైగా టాటా గ్రూప్‌లోని ఇతర కంపెనీలు కూడా బాగా రాణిస్తుండడంతో ‘టాటా’ బ్రాండ్‌ విలువ సైతం స్టాక్‌ ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది. దేశీయంగా టాటా మోటార్స్‌ను పరిశ్రమ వర్గాలు ఇండియన్‌ టెస్లాగా అభివర్ణిస్తుండడం విశేషం. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. టాటా మోటార్స్ తయారు చేస్తున్న విద్యుత్తు వాహనాలు టెస్లా కార్లకు ఏమాత్రం తీసిపోవని ప్రశంసించడం గమనార్హం. 2030కి మొత్తం వాహనాల్లో 30 శాతం విద్యుత్‌ వాహనాలను తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యంలో టాటా మోటార్స్‌ కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే టాటా మోటార్స్‌ షేర్లు ఈరోజు దూసుకెళ్లాయి.     

ప్రయాణికుల విద్యుత్‌ వాహన విభాగంలోకి టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7500 కోట్లు) సమీకరించనున్నట్లు దేశీయ టాటా మోటార్స్‌ బుధవారం ప్రకటించింది. ఇందుకు టాటా మోటార్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీకి చెందిన టీపీజీ రైజింగ్‌ క్లైమేట్‌లు బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం.. టీపీజీ రైజ్‌ క్లైమేట్‌, సహ పెట్టుబడిదారు ఏడీక్యూ (అబుధాబి ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ)తో కలిసి కొత్త ఏర్పాటు కానున్న టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సంస్థ విలువను 9.1 బిలియన్‌ డాలర్లు (రూ.68,250 కోట్లు)గా లెక్కకట్టిన తర్వాత టీపీజీ గ్రూప్‌ అందులో 11-15 శాతం వాటా పొందనుంది. ఈ పెట్టుబడులు 18 నెలల వ్యవధిలో పలు దఫాలుగా జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని