Tata Tigore: టాటా మోటార్స్‌ నుంచి మరో EV.. బుకింగ్స్‌ షురూ!

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ పేరిట ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి విడుదల చేసిన ఆ కంపెనీ.. తాజాగా టిగోర్‌ ఈవీ పేరిట మరో కారును బుధవారం లాంచ్‌ చేసింది.

Published : 18 Aug 2021 17:39 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ పేరిట ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి విడుదల చేసిన ఆ కంపెనీ.. తాజాగా టిగోర్‌ ఈవీ పేరిట మరో కారును బుధవారం లాంచ్‌ చేసింది. దీనికి సంబంధించిన బుకింగ్‌లను ప్రారంభించింది. డీలర్ల వద్ద రూ.21వేలు చెల్లించి కొత్త టిగోర్‌ను బుక్‌ చేసుకోవచ్చని టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

దేశంలో ఈవీలు ప్రధాన స్రవంతిలోకి రాబోతున్నాయని కారు విడుదల సందర్భంగా కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ (ప్యాసింజర్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌) వివేక్‌ శ్రీవత్స పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో రెండో కారును తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. పనితీరు, సాంకేతికత, విశ్వసనీయత, ఛార్జింగ్‌, సౌకర్యం ఇలా అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని టిగోర్‌ ఈవీని రూపొందించినట్లు టాటా మోటార్స్‌ ఉపాధ్యక్షుడు (వెహికల్‌ బిజినెస్‌) ఆనంద్‌ కులకర్ణి తెలిపారు. నెక్సాన్‌ మాదిరిగానే ఇందులోనూ జిప్ట్రాన్‌ టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు.

ఇక కారు స్పెషిఫికేషన్స్‌ విషయానికొస్తే.. టిగోర్‌ ఈవీ గరిష్ఠంగా 55KW పవర్‌ను, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 5.7 సెకన్లలోనే 0-60 వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 26 kWh లిథియం ఐయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఎనిమిదేళ్లు, 1.60 లక్షల కిలోమీటర్లు వరకు మోటార్‌, బ్యాటరీపై వారెంటీ లభిస్తుందని కంపెనీ తెలపింది. 15A ప్లగ్‌ పాయింట్‌ ద్వారా ఫాస్ట్‌ ఛార్జింగ్‌, స్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. 30కు పైగా కనెక్టెడ్‌ ఫీచర్లకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. ధరెంత అనేది కంపెనీ వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని