Air India: టాటా సన్స్‌దే ఎయిరిండియా

ఎయిరిండియా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  అప్పుల ఊబిలో కూరుకుపోయిన విమానయాన సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే శుక్రవారం అధికారికంగా వెల్లడించారు....

Updated : 08 Oct 2021 17:31 IST

దిల్లీ: ఎయిరిండియా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విమానయాన సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం-దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. టాటా సన్స్‌ దాఖలు చేసిన బిడ్‌ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉందని.. ఎయిరిండియా కొత్త యజమాని అదే కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం ప్రకటనతో ఆ ఊహాగానాలన్నీ నిజమయ్యాయి. దీంతో 68ఏళ్ల తర్వాత ఎయిరిండియా తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్లనుంది.

ఎయిరిండియాలో 100 శాతం వాటాలతో పాటు.. అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సైతం పూర్తిగా టాటాలపరం కానుంది. అలాగే గ్రౌండ్‌ హాండ్లింగ్‌ కంపెనీ ‘ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏఐఎస్‌ఏటీఎస్‌)’లోనూ టాటాలకు 50 శాతం వాటాలు దక్కనున్నాయి.

* 2021 ఆగస్టు ఆఖరుకు సంస్థకు రూ.61,562 కోట్ల రుణ భారం ఉండగా, విజయవంతమైన బిడ్డరు రూ.15,300 కోట్లను చెల్లించాల్సి వస్తుంది. మిగిలిన రూ.46,262 కోట్ల రుణభారాన్ని ఎయిరిండియా అసెట్‌ హోల్డింగ్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌)కు బదిలీ చేస్తారు.

* దేశీయ విమానాశ్రయాల్లో దేశీయ ప్రయాణాలకు 4400, అంతర్జాతీయ ప్రయాణాలకు 1800 ల్యాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్‌లు ఎయిరిండియాకు ఉన్నాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్‌లున్నాయి.

* ప్రస్తుతం ఎయిరిండియాలో ఉన్న ఉద్యోగులందరినీ టాటా సన్స్‌ ఏడాది పాటు విధుల్లో కొనసాగించాలి. రెండో సంవత్సరంలో వారికి స్వచ్ఛంద ఉద్యోగవిరమణకు అవకాశం ఇవ్వొచ్చు.

ఎయిరిండియా బ్రాండ్‌ను, లోగోను ఐదేళ్ల వరకు టాటా సన్స్‌ ఇతరులకు బదిలీ చేయొద్దు. ఒకవేళ తర్వాత చేయాలనుకున్నా భారతీయులకే చేయాలి.

టాటాలకే ఎందుకంటే..

సంస్థను దక్కించుకునేందుకు గత నెల 29న పలు సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేశాయి. బిడ్‌ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిరిండియా కోసం టాటా సన్స్‌ సహా స్పైస్‌జెట్‌ అధిపతి అజయ్‌ సింగ్‌ కూడా ఆర్థిక బిడ్లు సమర్పించిన వారిలో ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల ఎయిరిండియా ‘మినిమం రిజర్వ్‌ ప్రైస్‌’ ఖరారు చేసింది. భవిష్యత్తులో క్యాష్‌ ఫ్లో అంచనాలు, బ్రాండ్‌ విలువ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్ల ఆధారంగా రిజర్వ్‌ ప్రైస్‌ను రూ.12,906 కోట్లుగా నిర్ణయించినట్లు తుహిన్‌ కాంత తెలిపారు. టాటా సన్స్‌ బిడ్‌లో కోట్‌ చేసిన రూ.18,000 కోట్లు.. రిజర్వ్‌ ప్రైస్‌ కంటే ఎక్కువ ఉంది. అలాగే భవిష్యత్తుల్లో సంస్థ పునరుద్ధరణపై టాటాలు సమర్పించిన ప్రణాళిక ఆకర్షణీయంగా ఉండడంతో.. ప్రభుత్వం వారిని విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసింది. రూ.18,000 కోట్లలో రూ.15,300 కోట్ల రుణాలను టాటా సన్స్‌ తమ చేతుల్లోకి తీసుకోనుంది. మిగిలిన రూ.2,700 కోట్లను నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించనుంది.

ఎయిరిండియాను దక్కించుకొనే రేసులో టాటాలు ముందు నుంచి దూకుడుగా ఉన్నారు. అలాగే సంస్థ పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సమకూర్చే సత్తా టాటాలకు మాత్రమే ఉందని పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. పైగా వీరికి విమానయాన రంగంలో మంచి అనుభవం కూడా ఉంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థల్లో వాటాలు ఉన్నాయి. 

ప్రారంభించింది టాటాలే..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎయిరిండియాను ప్రారంభించింది టాటాలే. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరిట టాటా గ్రూప్‌ విమానయాన రంగంలోకి ప్రవేశించింది. 1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ తిరిగి వారి చేతుల్లోకే వెళ్లడం విశేషం. డిసెంబరు నాటికి ఎయిరిండియాలో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో ఎయిరిండియా కొత్త యజమాని అయిన టాటా సన్స్‌ చేతుల్లోకి వెళ్లిపోతుంది.

అన్నీ ఎయిరిండియా కిందకే..?

ఎయిరిండియా పునరుద్ధరణపై టాటా సన్స్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుబాటు ధరలో ఉండే విమానయాన సంస్థగా పేరుగాంచిన ఎయిర్‌ ఏషియా సంస్థలో టాటా సన్స్‌కు 83.67 శాతం వాటా ఉంది. ఎయిర్‌ ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌(మలేసియా)కు 16.33 శాతం వాటాలున్నాయి. అలాగే విస్తారాలో 51 శాతం వాటా టాటాలదే. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌(ఎస్‌ఐఏ)కు మిగిలిన 49 శాతం వాటాలున్నాయి. అయితే, వీటన్నింటినీ ఎయిరిండియా కిందకు తీసుకురావాలని టాటాలు యోచిస్తున్నట్లు సమాచారం. 

ఈ మేరకు ఇప్పటికే ఎస్‌ఐఏ, ఎయిర్‌ ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌(మలేసియా)తో టాటా సన్స్‌ చర్చలు జరిపినట్లు సమాచారం. విస్తారా, ఎయిర్‌ ఏషియా, ఎయిరిండియా.. మూడింటికి కలిపి దేశీయ విమానయాన విపణిలో 26 శాతం వాటా ఉన్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు ఒకే గొడుగు కిందకు రావడం ద్వారా మరింత ఎక్కువ మార్కెట్‌ను ఆకర్షించే అవకాశం ఉందని టాటాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్వహణ సైతం సమర్థంగా మారే అవకాశం ఉందని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇతర వాటాదారులకూ తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడింటిని కలిపే ప్రక్రియ కోసం ఇప్పటికే టాటా గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని