ఓవ‌ర్ స‌బ్స్‌క్రైబ్ అయిన `త‌త్వ చింత‌న్` ఐపీఓ

ప‌బ్లిక్ ఇష్యూ ధ‌ర ఒక్కో షేరుకి రూ. 1,073-1,083గా నిర్ణ‌యించ‌బ‌డింది.

Published : 19 Jul 2021 12:47 IST

పెట్టుబ‌డిదారుల నుండి బ‌ల‌మైన స్పంద‌న‌తో శుక్ర‌వారం బిడ్డింగ్ కోసం ప్రారంభించిన గంట‌ల్లోనే `త‌త్వ చింత‌న్` ఐపీఓ పూర్తిగా స‌బ్స్‌క్రైబ్‌ పొందింది. గుజ‌రాత్‌కు చెందిన ఈ స్పెషాలిటీ కెమిక‌ల్ కంపెనీ `త‌త్వ చింత‌న్ ఫార్మా కెమ్ లిమిటెడ్` ప్రారంభ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ) శుక్ర‌వారం జులై 16న బిడ్డింగ్ కోసం ప్రారంభించ‌బ‌డింది. ఇది జులై 20 వ‌ర‌కు చందా కోసం తెరిచి ఉంటుంది. ప‌బ్లిక్ ఇష్యూ ధ‌ర ఒక్కో షేరుకి రూ. 1,073-1,083గా నిర్ణ‌యించ‌బ‌డింది.

ఈ ఆఫ‌ర్‌కు పెట్టుబ‌డిదారుల నుండి, ముఖ్యంగా రిటైల్ పెట్టుబ‌డిదారుల నుండి బ‌ల‌మైన స్పంద‌న రావ‌డంతో `త‌త్వ చింత‌న్` ఐపీఓ శుక్ర‌వారం ప్రారంభ‌మైన గంట‌ల్లోనే పూర్తిగా స‌బ్స్‌క్రైబ్ అయ్యింది. ఈ శుక్ర‌వారం ఆఖ‌రిలో ఇది 4.55 రెట్లు ఓవ‌ర్  స‌బ్స్‌క్రైబ్ అయ్యింది. ఐపీఓ సైజు 3.26 మిలియ‌న్ ఈక్విటీ షేర్ల ఆఫ‌ర్‌కుగాను 14.71 మిలియ‌న్ ఈక్విటీ షేర్ల‌కు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా తెలిపింది. కంపెనీ త‌న వాటా అమ్మ‌కానికి ముందు 22 యాంక‌ర్ పెట్టుబ‌డిదారుల నుండి రూ. 150 కోట్లు వ‌సూలు చేసింది.

మార్కెట్ ప‌రిశీల‌కుల ప్రకారం, `త‌త్వ చింత‌న్` ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎమ్‌పీ) రూ. 750-760 ప‌రిధిలో ఉంది. శుక్ర‌వారం `జీఎమ్‌పీ` రూ. 710-720తో పోలిస్తే ఇది ఎక్కువ‌. గ్రే మార్కెట్ అన‌ధికార ప్లాట్‌ఫామ్‌. దీనిలో ఐపీఓ ధ‌ర‌లు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఐపీఓ వాటాల లిస్ట్ వ‌ర‌కు ట్రేడింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. రూ. 500 కోట్ల ఈ ఆఫ‌ర్‌లో తాజా ఇష్యూ రూ. 225 కోట్లు. ప్ర‌మోట‌ర్ గ్రూప్ అజ‌య్‌కుమార్ మ‌న్‌శుక్లాల్ ప‌టేల్‌, చింత‌న్ నితికుమార్ షా, శేఖ‌ర్ ర‌సిక్లాల్ సోమానీల‌తో క‌లిసి రూ. 275 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ క‌లిగి ఉంది. ఇష్యూ ద్వారా వ‌చ్చే ఆదాయం ఉత్పాద‌క స‌దుపాయాల విస్త‌ర‌ణ‌కు, `వ‌డోద‌ర‌`లోని ఆర్ అండ్ డీ సౌక‌ర్యం వ‌ద్ద అప్‌గ్రేడేష‌న్ కోసం ఉప‌యోగించ‌బ‌డుతుంది.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎమ్ ఫైనాన్షియ‌ల్ ఈ ఇష్యూకు బుక్ లీడ్ మేనేజ‌ర్లు కాగా, లింక్ ఇన్‌టైమ్ ఇండియా ఈ ఆఫ‌ర్‌కు రిజిస్ట్రార్‌. షేర్ల  కేటాయింపు జులై 26న జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే కంపెనీ షేర్ల‌ను లిస్ట్ చేయ‌డానికి తాత్కాలిక తేదీ జులై 29. `త‌త్వ చింత‌న్‌` అనేది ఒక ప్ర‌త్యేక‌మైన కెమిక‌ల్ త‌యారీ సంస్థ‌, ఇది ఉత్ప్రేర‌కాలు, సూప‌ర్ కెపాసిట‌ర్ బ్యాట‌రీల కొర‌కు ఎల‌క్ట్రోలైట్ ల‌వ‌ణాలు, ఔష‌ధాలు, ఆగ్రో కెమిక‌ల్స్ సామ‌గ్రి, ఇత‌ర ప్ర‌త్యేక ర‌సాయ‌నాల త‌యారీలో నిమ‌గ్న‌మై ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని