Kiara Advani: కియారా అడ్వాణీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారు ఇదే..

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్‌ హిట్‌లు అందుకున్న నటి కియారా అడ్వాణీ తాజా ఓ కొత్త కారు కొనుగోలు చేసింది...

Published : 15 Dec 2021 19:32 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కియారా అడ్వాణీకి కార్లంటే మోజు ఎక్కువే. ఎంఎస్‌ ధోనీ, కబీర్‌ సింగ్‌, లక్ష్మీ, గుడ్‌ న్యూజ్‌, షేర్షా వంటి సూపర్ హిట్‌ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మ కొత్త కారును ఇంట్లోకి ఆహ్వానించి సంవత్సరాంతాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటోంది. ఇప్పటికే ఆమె గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్‌5, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈ-క్లాస్‌, బీఎండబ్ల్యూ 530డీ వంటి విలావంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా వీటి జాబితాలో ఆడి ఏ8 ఎల్‌ కూడా చేరింది. ఈ విషయాన్ని ఆడి ఇండియా ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. సంస్థ హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆడి ఫ్యామిలీలోకి ఆహ్వానించారు.

ఆడీ ఏ8 ఎల్‌ ఫీచర్లు...

2020లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన ఆడి ఏ8 ఎల్‌.. బీఎస్6 మోడల్లో ఈ కంపెనీ నుంచి వచ్చిన మూడో కారు. దీని ధర రూ.1.56 కోట్లు(ఎక్స్‌షోరూం). ఆడి కంపెనీ నుంచి నాలుగో తరం వాహనంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కారు.. గత మోడళ్లతో పోలిస్తే డిజైన్‌లోనే కాకుండా అధునాత ఫీచర్లలో భిన్నంగా ఉంది. ఆడీ ఏ8 ఎల్ వీ6 3.0 లీటర్ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 48 వోల్టుల మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. 500 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ వద్ద 340 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. విలాసవంతమైన క్యాబిన్ దీని సొంతం. 5 టచ్ స్క్రీన్లు, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, క్లైమేట్ కంట్రోల్, వెనకున్న వారు కూడా వీడియోలు వీక్షించేందుకు రెండు ఆడీ టాబ్లెట్స్ సీట్లకు బిగించారు. వీటితో పాటు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్, రేర్ మ్యాట్రిక్ ఎల్ఈడీ రీడింగ్ లైట్లు వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ప్రమాదాలను ముందుగానే పసిగట్టే ఆడీ ప్రీ సెన్స్ బేసిక్, 8 ఎయిర్ బ్యాగులు, చుట్టూ కెమెరాల పర్యవేక్షణ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని