Home Loan: బజాజ్‌ ఫైనాన్స్‌ న్యూ ఇయర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీరేటుకే హోంలోన్‌

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కొత్త సంవత్సరం సందర్భంగా గృహ రుణాలు తీసుకునేవారి కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది....

Published : 29 Dec 2021 18:09 IST

దిల్లీ: బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కొత్త సంవత్సరం సందర్భంగా గృహ రుణాలు తీసుకునేవారి కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి కనిష్ఠంగా 6.65 శాతం వడ్డీరేటుతో రుణాలు అందజేస్తామని తెలిపింది. అలాగే తమ గృహరుణాలను ఆర్‌బీఐ రేపో రేటుకు అనుసంధానించే సౌకర్యాన్ని కూడా కల్పించింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ఈ నిర్ణయం తీసుకున్న తొలి సంస్థ తమదేనని తెలిపింది. 

సిబిల్‌ స్కోర్‌ 800 కంటే ఎక్కువ ఉన్నవారు ఆఫర్‌ కింద గృహరుణం పొందడానికి అర్హులని కంపెనీ ప్రకటించింది. 750-799 మధ్య స్కోర్‌ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వీరికి వడ్డీరేటు స్వల్పంగా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇక ఇతర సంస్థల్లో రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ హోంలోన్ ఉన్నవారు తమ సంస్థకు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అలాంటి వారికి టాప్‌-అప్‌ కింద రూ.1 కోటి అదనపు రుణాన్ని మంజూరు చేస్తామని ప్రకటించింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద వడ్డీరేటులో రాయితీ కూడా పొందే అవకాశం ఉందని తెలిపింది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదా బహుళజాతి కంపెనీల్లో పనిచేసే వేతన జీవులు కూడా ఈ ఆఫర్‌ కింద రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న ఎంబీబీఎస్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత గల వైద్యులు సహా చార్టెడ్‌ అకౌంటెంట్లు కూడా ఆఫర్‌ పొందవచ్చునని పేర్కొంది. సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా జనవరి 26, 2022 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని