
Crypto Currency: క్రిప్టో మార్కెట్లోనూ ఒమిక్రాన్ కుదుపు!
42,296 డాలర్లకు పడిపోయిన బిట్‌కాయిన్
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు క్రిప్టో కరెన్సీ మార్కెట్లనూ వెంటాడుతున్నాయి. శనివారం బిట్‌కాయిన్ విలువ 42,296 డాలర్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజే దాదాపు 11 శాతం నష్టాన్ని చవిచూసింది. ఇక బిట్‌కాయిన్ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన ఈథర్ విలువ 17.4 శాతం వరకు కుంగింది.శనివారం ఒక్కరోజే 2.4 బిలియన్ డాలర్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని మదుపర్లు కోల్పోయారు. నవంబరు 10న జీవితకాల గరిష్ఠానికి చేరిన బిట్‌కాయిన్ విలువ ఇప్పటి వరకు 21,000 డాలర్లు తగ్గిపోయింది.
క్రిప్టోకరెన్సీల్లో ఒడుదొడుకులు మార్కెట్లో నెలకొన్న అస్థిరతను సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాల్ని కఠినతరం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో వడ్డీరేట్లు పెరిగి మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఒమిక్రాన్ భయాలు జతయ్యాయి. కొత్త వేరియంట్‌పై ఇంకా సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు తలెత్తనున్నాయోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సగటున 4 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి.
ఎంత కుంగినప్పటికీ.. క్రిప్టో కరెన్సీ విలువ గత ఏడాదితో పోలిస్తే 60 శాతం ఎగువనే ఉంది. అలాగే ఇతర అసెట్ క్లాస్‌లతో పోలిస్తే ఎక్కువ రాబడినే ఇచ్చాయి. ఇక ఇటీవలే బిట్‌కాయిన్‌ను చట్టబద్ధ మారక ద్రవ్యంగా గుర్తించిన ఎల్ సాల్వడార్ దేశం.. తాజా దిద్దుబాటులో మరిన్నింటిని కొనుగోలు చేసింది.
ఇవీ చదవండి
Advertisement