China: దాతగా మారుతున్న చైనా.. ఎందువల్ల?

చైనా అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకునే క్రమంలో ‘ప్రపంచ బ్యాంకు’ వంటి అనేక అభివృద్ధి సంస్థల్లో తమ వాటాను పెంచుకుంటూ పోతోందని ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్(సీబీడీ)’ తాజా నివేదిక తెలిపింది‌.....

Published : 21 Nov 2021 01:22 IST

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక

వాషింగ్టన్‌: ఆర్థికంగా, సైనిక పరంగా అమెరికాను అధిగమించి సూపర్‌ పవర్‌గా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న చైనా.. ఆ దిశగా ఒక్కో లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లు కనిపిస్తోంది! ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన దేశంగా డ్రాగన్‌ అవతరించింది. మరోవైపు చైనా అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకునే క్రమంలో ‘ప్రపంచ బ్యాంకు’ వంటి అనేక అభివృద్ధి సంస్థల్లో తమ వాటాను పెంచుకుంటూ పోతోందని ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్(సీబీడీ)’ తాజా నివేదిక తెలిపింది‌.

నివేదిక ప్రకారం.. ఈ ఏడాది వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చైనా ఇచ్చిన సొమ్ము 66 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో జపాన్‌ను వెనక్కి నెట్టి డ్రాగన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఏటా ఆయా సంస్థలు పేద, మధ్యాదాయ దేశాలకు 200 బిలియన్‌ డాలర్ల వరకు ఆర్థిక సాయాన్ని అందజేస్తుంటాయి. దాంట్లో చైనావే 66 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.

ఓవైపు ప్రపంచ బ్యాంకు, ఐరాస సంస్థల నుంచి సాయం తీసుకుంటూనే.. మరోవైపు ఆయా వేదికల్లో బలమైన దాతగా చైనా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించే ఐరాస అభివృద్ధి కార్యక్రమం, ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ఐరాస అనుబంధ సంస్థల్లో చైనా ఐదో అతిపెద్ద దాతగా నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రధాన దాతగా, వాటాదారుగా, సాయం తీసుకుంటున్న దేశంగా, అనేక అంతర్జాతీయ సంస్థల్లో వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనా.. ‘ప్రత్యేకంగా ప్రభావవంతమైన స్థానం’ సంపాదించుకుందని సీబీడీ అభిప్రాయపడింది. మొత్తం 76 ప్రపంచస్థాయి సంస్థల వివరాలను విశ్లేషించి ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ప్రారంభించిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్ ఇనీషియేటివ్‌’పైనే అనేక దేశాలు దృష్టిని కేంద్రీకరించాయని సీబీడీ అభిప్రాయపడింది. కానీ, ప్రపంచ బ్యాంకు వంటి కీలక సంస్థల్లో దాని ప్రాబల్యాన్ని మాత్రం గుర్తించలేకపోయాయని సీబీడీలో ఉన్నతాధికారి స్కాట్‌ మోరిస్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని