Crypto Currency: క్రిప్టో కుదేల్‌.. గంటలో 10 వేల డాలర్లు ఢమాల్‌!

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలు కుదేలవుతున్నాయి. ఇందుకు ఒమిక్రాన్‌ పరిణామాలకు తోడు భారత పరిణామాలు సైతం తోడయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే 38కి పైగా దేశాల్లో ఒమిక్రాన్‌ జాడలు కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు బయటపడడంతో

Updated : 05 Dec 2021 09:34 IST

బిట్‌ కాయిన్‌, ఈథర్‌ ధరల్లో క్షీణత
భారత్‌ పరిణామాలూ కారణం

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలు కుదేలవుతున్నాయి. ఇందుకు ఒమిక్రాన్‌ పరిణామాలకు తోడు భారత పరిణామాలు సైతం తోడయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే 38కి పైగా దేశాల్లో ఒమిక్రాన్‌ జాడలు కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు బయటపడడంతో శుక్రవారం మన సూచీలు సైతం నేలచూపులు చూశాయి. మరో వైపు, భారత్‌ క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా పేరు మార్చి, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కిందకు తీసుకురావాలని గట్టిగా భావిస్తుండడంతో క్రిప్టో కరెన్సీ సెంటిమెంటు దెబ్బతిన్నట్లుంది. మరో వైపు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ కఠిన ఆంక్షల వైపు మళ్లడమూ బలహీనతలను తెచ్చిపెట్టింది.

గంటలో 10,000 డాలర్లు కోల్పోయి..
అత్యంత ప్రజాదరణ ఉన్న క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్‌, ఈథర్‌లు శనివారం నాటి మార్కెట్లో దిగాలు పడ్డాయి. ఒక దశలో బిట్‌ కాయిన్‌ 42,000 డాలర్ల దిగువకు; ఈథర్‌ 3,500 డాలర్ల దిగువకు చేరుకున్నాయి. ఈ రెండూ 16%, 15 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. బిట్‌ కాయిన్‌ విషయానికొస్తే శనివారం ఒక గంట వ్యవధిలోనే 10,000 డాలర్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుని 48,000 డాలర్ల వద్ద తచ్చాడింది. ఈథర్‌ కూడా తర్వాత కోలుకుని 3900 డాలర్లకు చేరుకుంది. ఈ రెండూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వార్తలు వచ్చినప్పటి నుంచీ అంతర్జాతీయ మార్కెట్లతో పాటే హెచ్చుతగ్గులు చవిచూస్తూ వచ్చాయి. నవంబరు 10న 69,000 డాలర్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని చూసిన బిట్‌ కాయిన్‌ ఇపుడు 30 శాతం దిగువన చలిస్తోంది. సాధారణంగా ఆల్‌టైం గరిష్ఠాల నుంచి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడితే దాన్ని బేర్‌మార్కెట్‌గా పరిగణిస్తుంటారు. అంటే బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ ఇపుడు బేర్‌ చేతుల్లో చిక్కిందన్నమాట. కార్డనో, సొలానా, పాలీగాన్‌, షిబా ఇను వంటి క్రిప్టోకరెన్సీలు సైతం 13-20 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.


క్రిప్టోపై ఊహాగానాలు మంచిది కాదు

క్రిప్టో కరెన్సీలపై చాలా ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అసలు ఆరోగ్యకరమైన అంశాలు కాదు. పార్లమెంటులోకి వస్తున్న ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ బిల్లును ఆమూలాగ్రం చర్చించాకే కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని గుర్తు పెట్టుకోవాలి. ఈ ఏడాది జీడీపీ గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా వెలువడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మనం కొనసాగుతున్నాం. దేశంలో కొన్ని ప్రాంతాల్లో సరఫరా వైపు ఇబ్బందుల కారణంగా ఆహార ధరలు పెరిగాయి. జనవరి కల్లా ఇవి తగ్గుతాయి. ఎయిరిండియాను డిసెంబరు 31లోగా టాటా గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లేలా చేస్తాం.

- శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని