Billionaires: 2021లో మన కుబేరులు ఎంత సంపాదించారో తెలుసా?

దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కుబేరుల సంపద మాత్రం ఈ ఏడాది ‘తగ్గేదేలే’ అన్నట్లుగా దూసుకుపోయింది. గత ఏడాది కరోనా కష్టకాలంలోనూ 1.9 ట్రిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.1.42 కోట్ల కోట్లు) పోగేసుకున్న బిలియనీర్లు 2021లోనూ ఆ జోరును కొనసాగించారు....

Updated : 27 Dec 2021 11:21 IST

దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కుబేరుల సంపద మాత్రం ఈ ఏడాది ‘తగ్గేదేలే’ అన్నట్లుగా దూసుకుపోయింది. గత ఏడాది కరోనా కష్టకాలంలోనూ 1.9 ట్రిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.1.42 కోట్ల కోట్లు) పోగేసుకున్న బిలియనీర్లు 2021లోనూ ఆ జోరును కొనసాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2600+ బిలియనీర్లు ఈ ఏడాది 1.6 ట్రిలియన్ డాలర్ల(1.20 కోట్ల కోట్లు) సంపదను కూడబెట్టారు.


అగ్రరాజ్యానిదే అగ్రస్థానం

ఈ ఏడాది ప్రపంచ కుబేరుల సంపద 13.6 ట్రిలియన్‌ డాలర్ల(రూ.10.20 కోట్ల కోట్లు)కు చేరింది. అత్యధిక సంపద పోగేసుకున్న వారిలో అమెరికన్‌ బిలియనీర్లు ముందు వరుసలో ఉన్నారు. వారు ఈ ఏడాది 945 బిలియన్‌ డాలర్ల సంపదను సృష్టించారు. అక్కడి ప్రధాన స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన ఎస్‌అండ్‌పీ 500- 21శాతం, నాస్డాక్‌ 50 శాతం ఎగబాకడం ఇక్కడ గమనార్హం.


 టెస్లాతో దూసుకెళ్లిన మస్క్‌

అమెరికా కుబేరుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ గురించి. గత ఏడాది 110 బిలియన్ డాలర్ల మేర ఆర్జించిన ఆయన ఈసారి ఏకంగా 156 బిలియన్ డాలర్లు పోగేసుకున్నారు. మస్క్‌ సంపద ప్రస్తుతం దాదాపు 274 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఆయన సంపద ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం టెస్లా, స్పేస్‌ఎక్స్‌. టెస్లా షేర్లు ఈ ఒక్క ఏడాదిలోనే 44 శాతం మేర ఎగబాకగా.. స్పేస్‌ ఎక్స్‌ మార్కెట్‌ విలువ సైతం గణనీయంగా పెరిగింది. గత నెలలో ఈ కుబేరుడు ఓ అరుదైన ఘనత సాధించారు. ఈ భూమిపై 300 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా నిలిచారు. అయితే, టెస్లా షేర్లు తర్వాత కుంగడంతో ఆయన సంపద సైతం స్వల్పంగా కరిగిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ సహ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కంటే దాదాపు 75 బిలియన్‌ డాలర్ల అధిక సంపద మస్క్‌ వద్ద ఉండడం విశేషం.

మస్క్‌ తర్వాత అమెరికాలో అత్యధిక సంపద పోగేసుకున్న వారిలో గూగుల్‌ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్(44 బి.డా), సెర్గీ బ్రిన్‌ (42 బి.డా), లారీ ఎల్లీసన్‌ (30 బి.డా), స్టీవ్‌ బామర్‌ (27 బి.డా) ఉన్నారు.


అమెరికా తర్వాత మనమే

అమెరికా తర్వాత ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మన భారత కుబేరుల గురించే. ఎందుకంటే 2021లో అత్యధిక సంపద సృష్టించిన వారి జాబితాలో అగ్రరాజ్యం తర్వాత ఉన్నది మనమే. ఈ ఒక్క ఏడాదిలో 210 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.15.75 లక్షల కోట్లు) సంపదను ఆర్జించారు. మన ప్రధాన సూచీల్లో ఒకటైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఏకంగా 21 శాతం ఎగబాకడమే మన కుబేరుల సంపద ఎగబాకడానికి ప్రధాన కారణం.


మన కుబేరుల సంపద విలువ ఎంత?

కరోనా మహమ్మారి వరుసగా రెండో ఏడాదీ దేశంలో ప్రజలను ఇబ్బంది పెట్టినా.. దేశంలోని అత్యంత కుబేరుల సంపద విలువ మాత్రం 50 శాతం పెరిగిందని అక్టోబరులో ఫోర్బ్స్‌ వెల్లడించింది. దేశంలోని మొత్తం ధనవంతుల సంపద దాదాపు 730 బిలియన్‌ డాలర్ల(రూ.54.77 లక్షల కోట్లు)కు  చేరుకుంది. 2020 నుంచీ కరోనా కారణంగా పలు దశల్లో లాక్‌డౌన్‌లు విధించినా కూడా, వీరి సంపద విలువ గతేడాది కంటే 50 శాతం పెరిగేందుకు భారత ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్ఠతే కారణమని ఫోర్బ్స్‌ అభిప్రాయపడింది.

భారత్‌లో టాప్‌-5 బిలియనీర్లు వీరే


అంబానీయే టాప్‌ 

ఇక దేశ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు. దాదాపు గత దశాబ్ద కాలంగా ఆయన ఈ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఓ దశలో అంబానీ సంపద విలువ 100 బిలియన్ డాలర్లు దాటడంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం 89 బిలియన్ డాలర్ల(రూ.6.67 లక్షల  కోట్ల)తో 12 వ స్థానంలో కొనసాగుతున్నారు.


అదానీ తీరే వేరు 

అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ సంపద మాత్రం నా రూటే సపరేటు అన్నట్లుగా పెరిగింది. ఈయన గతేడాది కాలంగా రోజుకు రూ.1002 కోట్లు ఆర్జించారట. దీంతో గతేడాదితో పోలిస్తే ఈయన సంపద విలువ 261 శాతం పెరిగి రూ.5,05,900 కోట్లకు చేరిందని అక్టోబరులో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా పేర్కొంది. ఈ రెండు నెలల్లోనూ ఆయన సంపద మరింత పెరిగిందే తప్ప తగ్గింది లేదు. అదానీ గ్యాస్‌ షేర్లు ఈ ఏడాది దాదాపు 342 శాతం పెరగ్గా.. అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు 327 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 256 శాతం పెరిగాయి. దీంతో ఆయన నికర సంపద ప్రస్తుతం 78.7 బిలియన్‌ డాలర్ల(రూ.5.90 లక్షల కోట్లు)కు ఎగబాకింది.



* అమెరికా, భారత్‌ తర్వాత కుబేరుల సంపద అత్యధికంగా పెరిగిన దేశాల జాబితాలో రష్యా ఉంది. ఆ దేశ కుబేరులు ఈ ఏడాది మరో 145 బిలియన్‌ డాలర్ల సంపదను ఆర్జించారు. టెలిగ్రాం యాప్‌ సృష్టికర్త పావెల్‌ డురోవ్‌ ఆ దేశ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. 

* 2020లో భారీగా పెరిగిన చైనా బిలియనీర్ల సంపద విలువ ఈసారి దిగజారడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌, టెక్‌, ఎడ్యుటెక్‌ సంస్థలపై అక్కడి షీ జిన్‌పింగ్‌ సర్కార్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి కుబేరుల సంపద పడిపోయింది. ఈ ఏడాది కేవలం 4 శాతం మాత్రమే సంపద సృష్టి జరిగింది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా సంపద 23 బిలియన్‌ డాలర్లు కుంగగా.. కొలిన్‌ ఝెంగ్‌ హువాంగ్‌ సంపద 43 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. 

* ఈ ఏడాదిలో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారీగానే చేరారు. ఎస్టోనియా, బల్గేరియా నుంచి తొలిసారి బిలియనీర్లు పుట్టుకొచ్చారు.

 

(**గణాంకాలన్నీ డిసెంబరు 24, 2021 నాటి వివరాల ప్రకారం)

                                               - ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని