Health Insurance: ఆరోగ్య బీమా పాలసీ ఎంపికలో ఈ తప్పులు చేయొద్దు!

ఆరోగ్య బీమా పాలసీ సమగ్రంగా ఉండాలంటే.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు..! అవేంటో తెలుసుకుందాం....

Updated : 20 Nov 2021 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిత్యావసరాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మనకు నచ్చినవి.. మన్నికైనవి మాత్రమే ఎంచుకుంటాం. కానీ, బీమా పాలసీలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా మంది తగిన పరిశీలన చెయ్యరు. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారులు పుట్టుకొస్తున్న ఈ తరుణంలో ఆరోగ్య బీమా సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్యం తలెత్తితే.. ఆర్థికంగా కుంగిపోవాల్సిందే. అందుకే బీమాను ఒక ఖర్చుగా కాకుండా మన ఆరోగ్యంపై మనం చేస్తున్న మదుపుగా భావించాలి. అయితే, ఆరోగ్య బీమా పాలసీ సమగ్రంగా ఉండాలంటే.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు..! అవేంటో తెలుసుకుందాం...

సరైన పరిశోధన చేయాలి...

ఆరోగ్య బీమా తీసుకోవడానికి ముందు మార్కెట్లో ఉన్న బీమా పాలసీలను సరిపోల్చాలి. ఏవైనా రెండు ఆరోగ్య బీమా పాలసీలను పోల్చేటప్పుడు కేవలం ప్రీమియం ధరలనే చూడొద్దు. అవి అందించే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీంతోపాటు లాయల్టీ బోనస్, నో క్లెయిం బోనస్, ఆరోగ్యాన్ని కాపాడుకునే వారికి అదనపు రాయితీల్లాంటివీ చూడాలి.

ప్రీమియం తక్కువగా ఉందని ఎంచుకోవద్దు...

పాలసీని ఎంచుకునేటప్పుడు అది అందించే ప్రయోజనాలను చూడాలి. అంతేకానీ.. ప్రీమియం తక్కువగా ఉందని ఏదో ఒక పాలసీని ఎంచుకుంటే.. అంతిమంగా క్లెయింల సందర్భంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా సహ-చెల్లింపు, గది అద్దె, ఐసీయూ ఖర్చులపై పరిమితి వంటి నిబంధనలు ఉండకూదు.

అన్ని ఖర్చులనూ భరించేలా...

కేవలం ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే పరిహారం ఇచ్చేలా పాలసీలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించాలి. అలా కాకుండా.. చికిత్స సమయంలో అయ్యే అన్ని ఖర్చులనూ చెల్లించేలా పాలసీ ఉండాలి. ఔషధాల బిల్లులు, ఔట్‌ పేషెంట్‌ చికిత్స, ఇతర వ్యయాలనూ కలిపి చెల్లించే ఏర్పాటు ఉండాలి. అంతేకాకుండా.. భవిష్యత్తులో పెరిగే చికిత్స ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా పాలసీ మొత్తం పెరిగే వీలూ ఉండాలి. ఇలా అన్ని ఖర్చులను భరించేలా మీరు తీసుకునే పాలసీ ఉండేలా చూసుకోవాలి.

తీవ్ర వ్యాధులకు...

ఈ మధ్యకాలంలో కేన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్‌ సహా ఇతర జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏదైనా తీవ్ర వ్యాధిని గుర్తించినప్పుడు చికిత్సతో సంబంధం లేకుండా పరిహారాన్ని ఇచ్చే విధంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల వరకూ ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ ఉండేలా చూసుకోండి. వ్యాధిని గుర్తించగానే ఒకేసారి పరిహారం ఇస్తారా? వాయిదాల్లో చెల్లిస్తారా? అనే అంశాన్నీ చూసుకోవాలి. కొన్ని పాలసీల్లో కొన్ని నెలలపాటు ఆదాయంలా అందించే ఏర్పాటూ ఉంటుంది. ఆదాయం ఆగిపోయిన సందర్భాల్లో ఈ పాలసీలు ప్రయోజనకరంగా ఉంటాయి.

వివరాలు దాచొద్దు...

పాలసీ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలు, ఆహార అలవాట్ల గురించి ఎలాంటి దాపరికం ఉండకూడదు. పాలసీదారుడు పూర్తి వివరాలు తెలియజేయకపోతే.. బీమా సంస్థ క్లెయింలను తిరస్కరించేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయంలో పాలసీదారుడు పారదర్శకంగా ఉండటమే మేలు.

ఎక్కడైనా వర్తించేలా...

నాణ్యమైన వైద్యం కోసం ఎంతదూరం వెళ్లడానికైనా వెనుకాడట్లేదు. కాబట్టి, మనం ఎంచుకునే పాలసీలో అంతర్జాతీయంగానూ కవరేజీ ఉండాలి. గ్లోబల్‌ కవర్‌ పేరుతో అందిస్తున్న ఈ పాలసీల్లో అన్ని రకాల వ్యాధులు, అత్యవసర చికిత్స, ఓపీడీ, ప్రయాణ ఖర్చులు.. ఇలా అన్నింటికీ వర్తించేలా పాలసీ ఎంచుకోవాలి.

టాపప్‌ పాలసీ...

ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు పెరుగుతూ పోతాయి. పదేళ్ల క్రితం రూ.10 వచ్చిన వస్తువుకు ఇప్పుడు రూ.50 పెట్టాల్సి రావొచ్చు. కాబట్టి కొన్నేళ్ల క్రితం తీసుకున్న పాలసీ ఇప్పటి చికిత్సా అవసరాలకు సరిపోకపోవచ్చు. అందుకే ఇప్పటికే ఉన్న పాలసీ మొత్తాన్ని పెంచుకోవాలంటే.. కొత్త పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రాథమిక పాలసీకి అనుబంధంగా సూపర్‌ టాపప్‌ పాలసీలను ఎంచుకుంటే సరిపోతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభించాలనుకున్నప్పుడు వీటిని తీసుకోవాలి.

అసలు వేటికి వర్తించదో ముందే తెలియాలి...

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. వర్తించని అంశాలేమిటన్నది ముందే తెలుసుకోవాలి. వేచి ఉండే సమయం, ఏయే వ్యాధులకు వర్తించదు వంటివి ముందే అడిగి తెలుసుకోవాలి. తీరా క్లెయిం చేసుకున్నాక తిరస్కరిస్తే.. ఇబ్బందులు తప్పవు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని