Elon Musk: చేతిలో చిల్లిగవ్వ లేకుండానే అమెరికా వచ్చి..!

ఎలాన్‌ మస్క్‌.. అసలు తాను విద్యార్థిగా అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని గుర్తు చేసుకున్నారు.

Published : 17 Dec 2021 16:50 IST

ఆర్థిక కష్టాలను గుర్తుచేసుకున్న ప్రపంచ కుబేరుడు

న్యూయార్క్‌: టెస్లా సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంత వ్యక్తుల్లో ఒకరిగా నిలిచి రికార్డులు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మ్యాగజైన్ ది టైమ్‌ కూడా ఈమధ్యే ఆయన్ను ఈ ఏటి మేటి వ్యక్తిగా (పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2021గా) ప్రకటించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్నవారిని కూడా పక్కకునెట్టి ఇటీవలే ఆయన తొలిస్థానానికి ఎగబాకారు. ఇలా అన్ని రంగాల్లో దూసుకెళ్తోన్న ఆయనపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో ఓ ట్వీట్‌కు స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. అసలు తాను విద్యార్థిగా అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని గుర్తు చేసుకున్నారు.

మస్క్‌ను ప్రశంసిస్తూ ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు. ‘17ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఎలాన్‌ మస్క్‌ అమెరికా వచ్చారు. దేశానికి సంపద సృష్టించారు. మన ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంతో ఆదాయాన్ని కల్పించారు. అమెరికా ఎగుమతులను పెంచారు. ఉద్యోగాలను కల్పించడంతోపాటు ఎంతో మందిని లక్షాధికారులను చేశారు’ అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. దీనికి తాజాగా రిప్లై ఇచ్చిన మస్క్‌.. ‘చేతిలో డబ్బు లేకుండా నేను అమెరికాకు వచ్చాను. పాఠశాలలో ఉన్న సమయంలోనే రెండు ఉద్యోగాలు చేశాను. స్కాలర్‌షిప్‌ వంటివి వచ్చినప్పటికీ గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేనాటికి లక్ష డాలర్ల ($100K)లకుపైగా అప్పు అయ్యింది’ అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇదిలా ఉంటే, ఓవైపు స్పేస్‌ఎక్స్‌ ద్వారా అంతరిక్ష రంగంలో దూసుకెళ్తోన్న మస్క్‌.. టెస్లా ద్వారా ట్రిలియన్‌ డాలర్ల విలువగల ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. సోలార్‌, రోబోటిక్స్‌, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్న ఆయన.. 250 బిలియన్‌ డాలర్లకుపైగా సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తున్నారు. ఇలా అపర కుబేరుడిగా మారిన ఎలాన్‌ మస్క్‌.. కెరీర్‌ తొలిరోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు ఆయనే స్వయంగా చెప్పడం ఎంతో మంది యువపారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిని కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని