Flex Engines: పెట్రో భారం తగ్గించేలా కొత్త విధానం: కేంద్ర మంత్రి గడ్కరీ

దేశ ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం త్వరలోనే ‘ఫ్లెక్స్‌ ఇంజిన్‌’ విధానాన్ని తీసుకు రానుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ..

Updated : 27 Oct 2021 11:53 IST

‘ఫ్లెక్స్‌ ఇంజిన్‌’పై ముమ్మర కసరత్తు
ఇథనాల్‌ ఉత్పత్తి, వినియోగాలకు ఊతం

నాగ్‌పుర్‌: దేశ ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం త్వరలోనే ‘ఫ్లెక్స్‌ ఇంజిన్‌’ విధానాన్ని తీసుకు రానుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఫ్లెక్స్‌ ఇంజిన్లతో.. పెట్రోల్‌ లేదా ఇథనాల్‌ను వాహనాల్లో వినియోగించవచ్చని చెప్పారు. ఇథనాల్‌ తక్కువ ధరలో లభించడమే కాకుండా కాలుష్యం తగ్గిస్తుందన్నారు. ‘ఈటీవీ భారత్‌’కు ఆయన ఈ మేరకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇథనాల్‌ ఆధారిత ఫ్లెక్స్‌ ఇంజిన్ల వినియోగం ద్వారా పెట్రోల్‌ అవసరం తగ్గుతుందని, ప్రజలకు ఇంధన ధరల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ‘బ్రెజిల్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో వాహనాలు పెట్రోల్‌తో పాటు బయో ఇథనాల్‌తోనూ నడుస్తాయి. మన దేశంలో లీటరు పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.100కు పైగా ఉంది. ఇథనాల్‌ ధర రూ.65 మాత్రమే. పెట్రోల్‌ కంటే ఇథనాల్‌ ఎన్నో రెట్లు ఉత్తమం. అందుకే ఫ్లెక్స్‌ ఇంజిన్‌ ఆవశ్యకత ఉంది. వీటివల్ల వాహనాల్లో పెట్రోల్‌ లేదా ఇథనాల్‌ను వినియోగించవచ్చు. అదనంగా ఒక ఫిల్టర్‌ మాత్రమే అవసరం. లీటరు ఇథనాల్‌ ద్వారా కనీసం రూ.25 ఆదా చేసుకోవచ్చు. రైతులకూ మేలు జరుగుతుంది’ అని వివరించారు.

మూడేళ్లలో అమెరికా మాదిరి రోడ్లు
రాబోయే రోజుల్లో పెట్రోల్‌ స్థానాన్ని ఇథనాల్‌ భర్తీ చేస్తుందని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. బియ్యంతో, ఇతర ధాన్యాలతోనూ దీనిని ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. పట్టణాల్లో వెలువడే వ్యర్థాలు కూడా ఇథనాల్‌ ఉత్పత్తికి ఉపయోగపడతాయని వెల్లడించారు. ‘ఐదు టన్నుల గడ్డితో ఒక టన్ను బయో-సీఎన్‌జీని ఉత్పత్తి చేయగలం. బయో-సీఎన్‌జీకి బదులు బయో-ఎల్‌ఎన్‌జీని కూడా తయారు చేసుకోగలం. భారత వాయుసేనలోనే కాకుండా సాధారణ విమానాల్లోనూ 50% ఇథనాల్‌ కలిపిన ఇంధనాన్ని వాడాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖల్ని కోరతాను’ అని తెలిపారు. రాబోయే మూడేళ్లలో దేశంలోని రోడ్లన్నీ అమెరికా రహదారుల మాదిరిగా మారిపోతాయని, 26 జాతీయ రహదారుల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. విలువ పరంగా ఆటోమొబైల్‌ రంగం రూ.15 లక్షల కోట్లకు చేరుతోందని, దేశంలో తయారయ్యే 50% ద్విచక్ర వాహనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. భారత్‌ సీరీస్‌ సంఖ్యా ఫలకాలపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందన్నారు. నాగ్‌పుర్‌లో 20 అంతస్తుల రైల్వేస్టేషన్‌ రానుందని, రైళ్లు నాలుగో అంతస్తు నుంచి రాకపోకలు చేస్తాయని గడ్కరీ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని