Updated : 31 Dec 2021 14:12 IST

GST On Textile: వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు అమలు వాయిదా

దిల్లీ: దేశంలోని వస్త్ర పరిశ్రమపై వచ్చే నెల 1 నుంచి జీఎస్టీ(GST) పెంచాలన్న ప్రతిపాదనలపై జీఎస్టీ మండలి(GST Council) వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. వచ్చే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయంలో అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపింది. చేనేత, జౌళిపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో వాయిదా పడనుంది.

జీఎస్టీ కౌన్సిల్‌ 46వ సమావేశం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitaraman) నేతృత్వంలో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరిగింది. అయితే, వస్త్రాలపై వర్తింపజేయాలని యోచించిన 12 శాతం పెంపు విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 30న దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సహా అనుబంధ రంగాల వర్తకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు సీతారామన్‌ ఇటీవల పలు రాష్ట్రాలతో జరిపిన బడ్జెట్‌(Budget) ముందస్తు సమావేశాల్లోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకించాయి.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌(KTR) డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేశంలో నేతన్నల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్ర నిర్ణయంపై పోరాడే వస్త్ర పరిశ్రమ వర్గాలకు, నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం కేటీఆర్‌ ఒక లేఖ రాశారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌నూ మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విటర్‌లో కోరారు. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్‌తో పాటు భాజపా గుజరాత్‌ అధ్యక్షుడు కూడా జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారని ఆయన ఉటంకించారు.

ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక చేనేతపై జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం పన్ను విధించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇంకో 7 శాతం పెంచితే నేతన్నలు పూర్తిగా నష్టాలపాలవుతారని ఆందోళన వ్యక్తం చేశాయి. పన్ను పెంపుదల వల్ల చేనేత విక్రయాలు తగ్గే ప్రమాదం ఉందని కేంద్రం గుర్తించాలని ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాల్లో విన్నవించాయి. ఇప్పటికే పత్తి, నూలు ధరలు గత ఏడాది 30 నుంచి 40 శాతం పెరిగాయని.. రసాయనాలు, రవాణా ఖర్చులు సైతం భారీగా పెరిగాయని తెలిపాయి. చేనేత, జౌళి రంగంలో 80 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయని పేర్కొన్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని తెలిపాయి. అందుకే కొత్త తరం చేనేత వృత్తిలోకి రావడం లేదని వాపోయాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జీఎస్టీ మండలి దీనిపై లోతుగా చర్చించాలన్న ఉద్దేశంతో వాయిదా వైపు మొగ్గుచూపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని