పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ఆదాయం ఎంతంటే..?

గతేడాది పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రికార్డు స్థాయిలో పెంచడంతో కేంద్రంపై కాసుల వర్షం కురిసింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల

Updated : 19 Jul 2021 16:19 IST

ఏడాదిలో 88శాతం వృద్ధి

దిల్లీ: గతేడాది పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రికార్డు స్థాయిలో పెంచడంతో కేంద్రంపై కాసుల వర్షం కురిసింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో ఏకంగా రూ.3.35లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 88శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

గతేడాది కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు గిరాకీ పడిపోయింది. ధరలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చునేందుకు కేంద్రం వీటిపై ఎక్సైజ్‌ సుంకాలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.19.98 నుంచి రూ.32.9కి, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.8కి పెరిగింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటిపై పన్ను వసూళ్లు రూ.3.35లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.1.78లక్షల కోట్లుగా ఉన్నాయి. 
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1.01లక్షల కోట్ల మేర ఎక్సైజ్‌ పన్ను వసూలైనట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ లోక్‌సభకు తెలిపారు. 

2017 జూన్‌ నుంచి దేశీయ చమురు ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరిస్తూ వస్తున్నాయి. గతేడాది ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో సుంకాలను పెంచినా ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. అయితే ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్‌, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటి పరుగులు పెడుతోంది.  

2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌ ధరను మొత్తం 75 సార్లు పెంచగా.. 10 సార్లు తగ్గించారు. ఇక ఆ ఏడాది డీజిల్‌ ధర 73 సార్లు పెరిగి, 24 సార్లు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌ ధర ఇప్పటికే 39 సార్లు, డీజిల్‌ ధర 36 సార్లు పెరగడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని