Tesla: టెస్లా ఇంత విలువైన కంపెనీగా ఎలా మారింది?  

టెస్లా విలువ ఇంతలా పెరగడం వెనుక ఉన్న కారణమేంటి? కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ అంతలా ఏం మాయ చేశారు? చూద్దాం.....

Updated : 06 Dec 2021 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్లా. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ 1 ట్రిలియన్‌ డాలర్లు దాటింది. టెస్లా తర్వాతి స్థానంలో ఉన్న పది కంపెనీల సమష్టి విలువకు ఇది సమానం. మరి టెస్లా మార్కెట్‌ విలువ ఇంతలా పెరగడం వెనుక ఉన్న కారణమేంటి? కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ అంతలా ఇన్వెస్టర్లను ఏం మాయ చేశారు?

మార్కెట్‌ వాటా తక్కువే..

కంపెనీ విలువను చూసి చాలా మంది టెస్లా కార్లు భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయని అనుకుంటారు! కానీ, అది నిజం కాదు. అయితే, క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సారి టెస్లా కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అయినా ఈ ఏడాది పూర్తయ్యే నాటికి టెస్లా కార్ల విక్రయాలు 10 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది. 2021లో అన్ని కంపెనీలవి కలిపి ప్రపంచ వ్యాప్తంగా 7.5 కోట్ల కార్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు. అందులో టెస్లా కార్లు 9లక్షల వరకు ఉండొచ్చు. అంటే మార్కెట్‌ వాటాలో కేవలం 1.2 శాతం మాత్రమే.

ఇవీ టెస్లా మోడళ్లు..

టెస్లా కార్లలో నాలుగు మోడళ్లకు భారీ ఆదరణ ఉంది. అవి మోడల్‌ ఎస్‌, మోడల్‌ 3, మోడల్‌ ఎక్స్‌, మోడల్‌ వై. వీటిలో అన్నింటికంటే విలువైంది మోడల్‌ ఎక్స్‌. దీని ధర 99,900 డాలర్లు. తర్వాత మోడల్‌ ఎస్‌ 90,000 డాలర్లు, మోడల్‌ వై 55,000 డాలర్లు, మోడల్‌ 3 ధర 42,000 డాలర్లు. ఇదే అన్నింటికంటే చౌకైనది. ఎక్కువగా అమ్ముడయ్యేదీ ఈ మోడలే. ఈ కారును త్వరలో భారత్‌కు తీసుకొచ్చేందుకు టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. దీని ధర భారత్‌ కరెన్సీలో రూ.70 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఒక్క కారుపై ఆదాయం..

ఒక్క కారును విక్రయించడం వల్ల టెస్లాకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? దీని కోసం ఆటోమోటివ్‌ గ్రాస్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌(ఏజీపీఎం)ను గమనించాల్సి ఉంటుంది. కారు విక్రయ ధర నుంచి దాని తయారీ వ్యయాన్ని తీసేస్తే ఇది వస్తుంది. టెస్లా ఏజీపీఎం 30 శాతంగా ఉంది. బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ వంటి పెద్ద కంపెనీల ఏజీపీఎంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. టెస్లా కంపెనీకి వస్తున్న ఆదాయంలో విక్రయాలదే సింహభాగం. అయితే, ఈ కంపెనీకి మరికొన్ని ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి.

ఇతర ఆదాయ మార్గాలు..

కార్లతో పాటు సోలార్‌ రూఫ్‌లు, పవర్‌ వాల్‌లు కూడా టెస్లా తయారు చేస్తుంది. ఇంటిపై కప్పుపై సోలార్‌ ప్యానెల్స్‌ పెట్టించుకోవాలనుకుంటే ఈ కంపెనీవి అందుబాటులో ఉంటాయి. అలాగే గోడలా ఉండే పవర్‌వాల్స్‌ను కూడా విక్రయిస్తోంది. విద్యుత్తును స్టోర్‌ చేసుకొని వాడుకునేందుకు ఈ గోడలు ఉపయోగపడతాయి. వీటితో పాటు కార్ల సర్వీసింగ్‌ నుంచి కూడా టెస్లాకు ఆదాయం వస్తోంది. వీటన్నింటి నుంచి టెస్లాకు 2020లో 32 బిలియన్‌ డాలర్లు సమకూరింది. ఇది 2021లో 45 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలో సైబర్‌ ట్రక్‌ను కూడా విడుదల చేసేందుకు ఈ కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే మధ్యతరగతి ప్రజల కోసం 25,000 డాలర్ల రేంజిలో ఓ కారును విడుదల చేయాలని భావిస్తోంది.

రెగ్యులేటరీ క్రెడిట్స్‌..

రెగ్యులేటరీ క్రెడిట్స్‌ అనేది అమెరికాలో ఉన్న ఒక వ్యవస్థ. దీని ప్రకారం.. కాలుష్య నియంత్రణా ప్రమాణాలను అందుకునే వాహనాలు తయారు చేసే కంపెనీలకు అక్కడి ప్రభుత్వం పాయింట్ల రూపంలో క్రెడిట్స్‌ ఇస్తుంది. ఇక ఆ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయని కంపెనీలు వీటిని ప్రభుత్వం నుంచిగానీ, లేదంటే అవి మిగులు ఉన్న సంస్థల నుంచిగానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టెస్లా పూర్తిగా విద్యుత్తు వాహనాలు తయారు చేస్తుండడంతో ఇవి భారీ ఎత్తున ఉన్నాయి. అందుకే మిగిలిన సంస్థలు దీని నుంచి కొనుగోలు చేస్తాయి. ఇది కూడా టెస్లాకు 100శాతం లాభం అందించే ఆదాయ వనరుల్లో ఒకటి. 2020లో ఈ ఒక్క మార్గంలోనే కంపెనీ 500 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. దీని వల్లే ఆ ఏడాది సంస్థ లాభాల్లోకి రాగలిగింది. ఇక 2021 తొలి త్రైమాసికంలోనే 518 మిలియన్‌ డాలర్లు విలువైన క్రెడిట్లను విక్రయించిందని సీఎన్‌బీసీ కథనం వెల్లడించింది. 

పరిశోధనలకే పెద్దపీట..!

ఇతర బడా కార్ల తయారీ కంపెనీలతో పోలిస్తే టెస్లా ఆదాయం చాలా తక్కువ. అయితే, వృద్ధి రేటు మాత్రం వేగంగా పరుగులు పెడుతోంది. ఆ ట్రెండ్‌ అలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో మిగిలిన కార్ల తయారీ సంస్థలను టెస్లా దాటేయడం ఖాయం. అయితే, ఈ ఆదాయాన్నంతా టెస్లా పరిశోధన, అభివృద్ధిపైనే ఖర్చు చేస్తోంది. అందుకే టెస్లా 2019 వరకు నష్టాల్లోనే ఉంది. 2020లో తొలిసారి సంస్థ నికర లాభాల్ని ఆర్జించింది. చాలా కార్ల కంపెనీలు వాటి ఉత్పత్తుల ప్రచారం కోసం భారీగా ఖర్చు చేస్తాయి. కానీ, టెస్లా మాత్రం ప్రకటనలకు ఒక్క డాలర్‌ కూడా ఖర్చు చేయదు. సంస్థ వ్యవస్ధాపకుడు ఎలాన్‌ మస్కే కంపెనీకి పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌!

వ్యయాలు తగ్గించేందుకు.. విభిన్న మార్గాలు..!

చాలా కంపెనీలు డీలర్‌షిప్‌ వ్యవస్థ ద్వారా కార్లను విక్రయిస్తాయి. కానీ, టెస్లా మాత్రం అందుకు భిన్నం. ఈ కారు కావాలంటే కంపెనీ వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేయాలి. లేదంటే షోరూంకు వెళ్లి తీసుకోవాలి. దీంతో డీలర్‌ వ్యవస్థ లేకుండానే విక్రయాలు జరుగుతాయి. ఫలితంగా కంపెనీకి కమీషన్‌ రూపంలో అయ్యే వ్యయం మిగులుతుంది.. వినియోగదారుడికి కూడా వ్యయం తగ్గుతుంది.

అర్థశాస్త్రంలో ఉండే ‘ఎకానమీ ఆఫ్‌ స్కేల్‌’ సూత్రం ఆధారంగా టెస్లా ఉత్పత్తి నడుస్తోంది. అంటే పెద్ద ఎత్తున ఒకేచోట ఉత్పత్తి జరగడం వల్ల తయారీ వ్యయం భారీ తగ్గతుందన్నది ఈ సూత్రం సారాంశం. అందుకే టెస్లా గిగా ఫ్యాక్టరీలను నమ్ముకొంది. ప్రస్తుతం ఈ కంపెనీకి నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరో రెండిటి నిర్మాణం జరుగుతోంది.

స్టాక్‌ విలువ మరీ ఎక్కువైందా?

ప్రస్తుతం అమెరికాలో అత్యంత ఆదరణ ఉన్న స్టాక్స్‌లో టెస్లాదే తొలి స్థానం. డిసెంబరు 2019లో రూ.లక్షను ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారి సంపద ఇప్పుడు రూ.15 లక్షలకు చేరుకుంది. అయితే, ఈ కంపెనీ స్టాక్‌ విలువ వాస్తవిక విలువ కంటే ఎక్కువగా ఉందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇతర సంస్థలు సైతం విద్యుత్తు కార్ల తయారీని భారీ ఎత్తున చేపడుతున్నాయి. పైగా టెస్లాతో పోలిస్తే వాటి ధరలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. దీంతో మార్కెట్‌లో టెస్లా కార్ల వాటా తగ్గుతోంది. 2020లో 79 శాతంగా ఉన్న మార్కెట్‌ షేర్‌.. 2021 తొలి ఆరు నెలల్లో 66 శాతానికి కుంగింది. అలాగే విద్యుత్తు వాహనాల తయారీ పెంచడంతో ఇతర కంపెనీలకూ రెగ్యులేటరీ క్రెడిట్స్‌ అందుతున్నాయి. ఫలితంగా మరికొన్ని రోజుల్లో టెస్లాకు వీటి విక్రయాల నుంచి వస్తున్న ఆదాయం పడిపోయే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.

 

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని