Published : 04 Jan 2022 11:57 IST

Used car loans: సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై ఎంత లోన్‌ ఇస్తారు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో పాత కార్ల (Used Cars)కూ డిమాండ్‌ బాగానే ఉంటుంది. నచ్చిన కారు ఖరీదు ఎక్కువగా ఉన్నా.. లేక అత్యవసరంగా కారు కొనాల్సి వచ్చినా చాలా మంది పాత కార్ల వైపే మొగ్గుచూపుతుంటారు. 2020లో పాత కార్ల విక్రయాల మార్కెట్‌ విలువ 27 బిలియన్ డాలర్లుగా ఉంది. 2026 నాటికి ఇది ఏటా 15 శాతం వృద్ధితో 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ రంగంలో ఉన్న వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్‌ సంస్థలు పాత కార్లకూ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ ఈ-కామర్స్‌ (e-Commerce) కంపెనీ కార్స్‌24తో చేతులు కలిపింది. పాత కార్లకూ ఫైనాన్స్‌ ఇచ్చేందుకు ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు పాతకార్లకు లోన్ తీసుకుంటున్న వారి వాటా 15 శాతంగానే ఉంది. ఇంకా చాలా మందికి సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోళ్లకు కూడా రుణం ఇస్తారన్న విషయం తెలియదు.

అయితే, పాత కారు కొనుగోలు చేసేందుకు లోన్ తీసుకునేటప్పుడు కొన్ని కీలక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అర్హత, రుణ మొత్తం, కాలపరిమితి (tenor), వడ్డీరేటు (Interest Rate), ప్రాసెసింగ్‌ రుసుము, ఈఎంఐ (EMI).. వంటి విషయాలు ముందే తెలుసుకోవాలి. కారు మోడల్‌, అది షోరూం నుంచి బయటకు వచ్చిన సంవత్సరం, కారు పనితీరు వంటివి రుణ మంజూరుపై ప్రభావం చూపుతాయి.

వడ్డీరేటు, కాలపరిమితి...

కొత్త కార్లతో పోలిస్తే పాత వాటికి కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేటు కాస్త ఎక్కవగానే ఉంటుంది. ఎందుకంటే పాత కార్లతో రిస్కు ఎక్కువ. అదే కొత్త కార్లపై తయారీ సంస్థ గ్యారంటీ వంటివి ఉంటాయి. పాత కారు విలువలో కేవలం 70-90 శాతం మాత్రమే రుణంగా ఇస్తారు. పైగా కారుకు విలువ కట్టడంలో రుణ సంస్థలకు ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది. సాధారణంగా పాత కారును మనం కొంటున్న ధర కంటే వారు లెక్కగట్టే విలువ తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాలపరిమితి కూడా తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక కారు జీవితకాలం 15 ఏళ్లు. 8-10 ఏళ్లు దాటిన కారుపై రుణాలు ఇవ్వడం కష్టం. ఒకవేళ మీరు 5 ఏళ్లు దాటిన కారును కొంటే రుణ కాలపరిమితి 3-5 ఏళ్లు ఉండే అవకాశం ఉంది.

సంస్థలూ ముఖ్యమే..

నిలదొక్కుకున్న సంస్థల నుంచి పాత కారును కొంటే రుణం తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. అదే మీకు తెలిసినవారు, పక్కింటివాళ్ల నుంచి కొంటే రుణం పొందడం కొంచెం కష్టమే. కొన్ని కార్లపై ముందే లోన్ తీసుకుని ఉంటారు. అలాంటి కార్ల నుంచి దూరంగా ఉండడమే మేలు.

ప్రత్యామ్నాయాలనూ పరిశీలించండి..

పాత కారుపై ఇచ్చే రుణ షరతులతో మీరు సంతృప్తిగా లేకపోతే ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. మీ అర్హతను బట్టి వ్యక్తిగత రుణం (Personal Loan) తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడు కారు కొనుగోలుకు కావాల్సిన మొత్తం మంజూరయ్యే అవకాశం ఉంది. పైగా వడ్డీరేటు కూడా తక్కువగా ఉంటుంది! అలాగే ఇప్పటికే గృహ రుణం తీసుకున్నవారు దానిపై టాప్‌-అప్‌ తీసుకోవడాన్ని కూడా పరిశీలించొచ్చు. ఇది అన్నింటికంటే చౌకైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు!

అసలు పాత కార్లు ఎవరు కొనాలి..

ఖరీదైన కారు కొనాలని ఉండి.. తగిన మొత్తం లేకపోతే పాత కారు కొనుగోలు వైపు చూడొచ్చు. అప్పుడు తక్కువ ధరకే ఖరీదైన, విలాసవంతమైన కారుని కొనే అవకాశం ఉంటుంది. సెగ్మెంట్‌ సీ, డీ కేటగిరీలోకి వచ్చే పాత సెడాన్‌లను కూడా కొనొచ్చు. సాధారణంగా రోడ్డు పైకి వచ్చిన తొలి ఏడాదే వీటి విలువ 40 శాతం వరకు పడిపోయే అవకాశం ఉంది.

ప్రస్తుతం ద్విచక్రవాహనం వినియోగిస్తూ.. కారు కొనాలనుకునే వారు పాత కార్లవైపు చూడొచ్చు. అలాగే వ్యాపారస్థులు రోజువారీ పనుల కోసం కూడా పాత కార్లను కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, 5-7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటే మాత్రం పాత కార్ల జోలికి వెళ్లొద్దు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని