ED Notice to Flipkart: ఫ్లిప్‌కార్ట్‌కు ఈడీ షోకాజ్‌ నోటీసులు..!

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు భారీ జరిమానాను ఎందుకు విధించకూడదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆ సంస్థను ప్రశ్నించింది.

Published : 05 Aug 2021 20:26 IST

 ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించారన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

దిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు భారీ జరిమానాను ఎందుకు విధించకూడదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆ సంస్థను ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులతో పాటు మరో తొమ్మిది మందికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. పెట్టుబడుల నిబంధనలు అతిక్రమించినందుకు రూ.10,600కోట్ల జరిమానాను ఎందుకు ఎదుర్కోకూడదని ఫ్లిప్‌కార్ట్‌ను ప్రశ్నించిన ఈడీ.. వీటిపై 90రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2009 నుంచి 2015 మధ్యకాలంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫారెన్‌ ఎక్ఛేంజీ మేనేజిమెంట్‌ యాక్ట్‌ (FEMA) నిబంధనలను ఫ్లిప్‌కార్ట్‌ అతిక్రమించిందనే ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోన్న ఈడీ.. తాజా నోటీసులు జారీ చేసింది.

భారత చట్టాలకు అనుగుణంగానే.. ఫ్లిప్‌కార్ట్‌

ఈడీ నోటీసులపై ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలను అనుసరిస్తూ.. భారత చట్టాలకు అనుగుణంగానే తమ సంస్థలో పెట్టుబడులను ఆహ్వానించామని ఓ ప్రకటనలో పేర్కొంది. అయినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించింది.

ఇదిలాఉంటే, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫ్లిప్‌కార్ట్‌లో విదేశీ పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతకొంత కాలంగా ఆ సంస్థపై దర్యాప్తు జరుపుతోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి.. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు జరపడం చట్టప్రకారం నిషేధమని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వాదిస్తోంది. 2009-2015 మధ్యకాలంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోన్న ఈడీ, వాటిపై చర్యల్లో భాగంగా భారీ జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఫ్లిప్‌కార్ట్‌కు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఇక అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ సంస్థ 2018లో భారీ పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని