Start Up: స్టార్టప్‌ల రంగంలో భారత్‌దే అగ్రాసనం: మోదీ

ప్రస్తుతం అంకుర సంస్థ(స్టార్టప్‌)ల యుగం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో దాదాపు 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు....

Published : 28 Nov 2021 15:00 IST

దిల్లీ: ప్రస్తుతం అంకుర సంస్థ(స్టార్టప్‌)ల యుగం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో దాదాపు 70 కంటే ఎక్కువ స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యువత అధిక సంఖ్యలో ఉన్న ఏ దేశంలోనైనా, మూడు అంశాలు- ఆలోచనలు-ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఏదైనా చేయగలమనే స్ఫూర్తి చాలా ముఖ్యమైనవని మోదీ హితబోధ చేశారు. ఈ మూడు అంశాలు కలిస్తే అపూర్వమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని చెప్పారు.

ఏటా అంకుర సంస్థల్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని పేర్కొన్నారు. ‘‘దేశంలో స్టార్టప్‌ల పరిధి చిన్న నగరాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం ‘యునికార్న్’ అనే పదం చర్చనీయాంశమైంది. యునికార్న్ స్టార్టప్.. అంటే దీని విలువ ఒక బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 7,000 కోట్లు). 2015 వరకు, దేశంలో తొమ్మిది నుంచి పది యునికార్న్‌లు ఉండేవి. కానీ, ఇప్పుడు యునికార్న్‌లలోనూ అగ్రగామిగా ఉంది. ఒక నివేదిక ప్రకారం.. గత 10 నెలల్లో, భారతదేశంలో ప్రతి 10 రోజులకు ఒక యునికార్న్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో 70 యూనికార్న్‌లు ఉన్నాయి’’ అని మోదీ తెలిపారు.

మరిన్ని వేదికలపై మన్‌ కీ బాత్‌

మన్‌ కీ బాత్‌ ఇకపై అన్ని ప్రముఖ మ్యూజిక్‌, ఆడియో వేదికలపై అందుబాటులో ఉండనుంది. స్పోటిఫై, హంగామా, గానా, జియోసావన్‌, వింక్‌, అమెజాన్‌ మ్యూజిక్ వంటి యాప్‌లలో ప్రధాని ప్రసంగాన్ని వినొచ్చు. ఇప్పటి వరకు టీవీ, రేడియో, నమో యాప్‌, యూట్యూబ్‌లో మాత్రమే ఈ కార్యక్రమం అందుబాటులో ఉండేది. మరింత ఎక్కువ మందికి ఈ కార్యక్రమాన్ని చేర్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని