Two Wheeler Finance: ఫైనాన్స్‌లో బైక్ కొంటే మంచిదేనా?
బైక్ కొనేటప్పుడు ఒకేసారి మొత్తం చెల్లిస్తే మేలా? లేక ఫైనాన్స్‌లో తీసుకుంటే మంచిదా? ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటో చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో వ్యక్తిగత ప్రయాణాలకు సామాన్యులు ఎక్కువగా ద్విచక్రవాహనాల వైపే మొగ్గుచూపుతారు. తక్కువ ధర, ట్రాఫిక్‌లో త్వరగా వెళ్లడం, నిర్వహణ ఖర్చులు తక్కువ వంటి అంశాలే అందుకు కారణం. పైగా రద్దీ ఎక్కువగా ఉండే మన మెట్రో నగరాల్లో కార్ల కంటే టూ వీలర్లలో వెళ్తే దాదాపు సగం సమయం ఆదా అవుతోందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా రోజువారీ అవసరాల నిమిత్తం బైక్‌ను ఉపయోగించేవారు కొందరైతే.. ద్విచక్రవాహనాలపై ప్యాషన్‌తో మరికొంత మంది వీటిని కొంటారు. ఇందులో తొలి కేటగిరీ వారికి 100-150 సీసీ ఇంజిన్ కెపాసిటీ బైక్ సరిపోతుంది. ఇక రెండో కేటగిరీ వారు 150 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉండే బైక్‌లపై ఆసక్తి చూపుతారు.
కొవిడ్ విజృంభణ తర్వాత చాలా మంది వ్యక్తిగత వాహనాలపై ప్రయాణం చేసేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో టూ వీలర్స్ ఆదరణ భారీగా పెరిగింది. అయితే, కార్లతో పోలిస్తే.. ద్విచక్రవాహనాల కొనుగోలుకు రుణ సాయం తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. మరి మొత్తం ఒకేసారి చెల్లిస్తే మేలా? లేక ఫైనాన్స్‌లో తీసుకుంటే మంచిదా? ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటో చూద్దాం..!
కొనుగోలు శక్తి పెరుగుతంది..
వాయిదాల పద్ధతి ఎంచుకుంటే.. బైక్ ఖరీదు మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి.. కొంచెం ఎక్కువ ధర బైక్‌నైనా కొనే అవకాశం ఉంటుంది. మీ డ్రీమ్ బైక్ కొనేందుకు ఇదొక మంచి అవకాశం. అలాగే కొన్నిసార్లు డబ్బు లేకపోవడం వల్ల రాజీ పడి మన అవసరాలకు తగిన బైక్ కొనలేకపోతాం. అదే లోన్ లేదా ఫైనాన్స్ తీసుకుంటే అలా రాజీపడాల్సిన అవసరం ఉండదు.
ఆర్థిక ఉపశమనం..
బైక్/స్కూటీ/స్కూటర్‌కు ఒకేసారి డబ్బు చెల్లిస్తే.. మీ జేబులు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా మీ పొదుపు నుంచి కూడా కొంత సొమ్ము తీయాల్సి రావొచ్చు. అలాంటప్పుడు ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఇబ్బందులు తప్పవు. అందుకే ఈఎంఐ ఎంచుకుంటే.. మీ పొదుపును కదిలించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికైనా మీరు సిద్ధంగా ఉన్నట్లే.
తక్కువ వడ్డీరేట్లు..
ప్రస్తుతం బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల మధ్య పోటీ పెరిగి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందజేస్తున్నాయి. ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. టూ వీలర్ లోన్స్‌పై వడ్డీ రేటు 7-18 శాతం వరకు ఉంటుంది. మీరు తీసుకున్న బ్యాంకు, కాలపరిమితిని బట్టి ఇది మారుతూ ఉంటుంది.
పొదుపు చేయడం అలవడుతుంది..
ప్రతినెలా బైక్ ఈఎంఐ కోసం మీ నెలవారీ ఆదాయం నుంచి కొంత సొమ్ము పక్కన పెట్టాల్సి ఉంటుంది. అలా మీకు తెలియకుండానే పొదపు చేయడం అలవాటు అవుతుంది. రుణం తీరిన తర్వాత కూడా దాన్ని అలాగే కొనసాగిస్తే.. పొదపు పెరుగుతుంది. దాన్ని సరైన పద్ధతిలో మదుపు చేస్తే.. సంపద సైతం సృష్టించుకోవచ్చు.
తక్షణ రుణ సదుపాయం..
పత్రాలు, ప్రక్రియలకు భయపడే చాలా మంది రుణం తీసుకోవడానికి వెనుకాడతారు. కానీ, ఈ మధ్య చాలా అంకుర సంస్థలు తక్షణమే ఆన్‌లైన్‌లో రుణాలు అందిస్తున్నాయి. అన్ని అర్హతలు ఉండి.. పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే గంటల్లో రుణాలు మంజూరు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. అయితే, వీటితో అప్రమత్తంగా ఉండాలి. కంపెనీల విశ్వసనీయతను గుర్తించడంలో విఫలమైతే ఇబ్బందులు తప్పవు.
పన్ను ప్రయోజనాలు..
మీరు స్వయం ఉపాధి పొందుతున్న వారైతే.. టూ వీలర్ లోన్‌పై కట్టే వడ్డీకి పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.