Investment Lessons: ఈ 5 చాణక్య సూత్రాలతో ఆర్థిక విజయం మీదే!

వ్యక్తిగత జీవితంలో ఆర్థిక విజయం సాధించేందుకు కూడా చాణక్యుడి సూత్రాలు పనిచేస్తాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం....

Updated : 03 Jan 2022 13:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చాణక్య’.. బహుశా భారత్‌లో పరిచయం అక్కర్లేని పేరు. పాలన, రాజకీయ ఎత్తుగడలు, మేనేజ్‌మెంట్‌.. ఇలా అన్ని రంగాల్లో ఆయనది అందెవేసిన చెయ్యి. ఈయన సహకారంతోనే చంద్రగుప్త మౌర్యుడు నంద సామ్రాజ్యాన్ని తుడిచిపెట్టారు. తర్వాత మౌర్య సామ్ర్యాజ్యానికి శ్రీకారం చుట్టి భారత దేశ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించారు.

జీవితంలో విజయం సాధించేందుకు చాణక్యుడి సూత్రాలను ఇప్పటికీ ‘చాణక్య నీతి’ పేరిట పాఠాలుగా బోధిస్తున్నారు. పుస్తకాలు అచ్చు వేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఆర్థిక విజయం సాధించేందుకు కూడా ఆయన అనేక విషయాలను బోధించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం..


సరైన మార్గంలో సంపద

‘‘సంపదను సరైన వారి చేతిలోనే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అందజేయొద్దు. మేఘాలుగా మారే సముద్రపు నీరు ఎప్పడూ తియ్యటి ఫలాలే ఇస్తుంది’’ - చాణక్య

మీరు డబ్బును ఎలా నిర్వహిస్తున్నారన్న దానిపైనే దాని వృద్ధి ఆధారపడి ఉంటుంది. చాణక్యుడు చెప్పినట్లు నీరు మేఘాలుగా మారితేనే వర్షం రూపంలో తిరిగి మంచి ఫలితానిస్తుంది. అదే సముద్రంలో కలిస్తే ఉప్పగా మారిపోతుంది. 

కాబట్టి మీ డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెడితేనే అది మంచి రాబడినిస్తుంది. అందుకోసం సురక్షితమైన స్టాక్స్‌, బాండ్లు, బంగారం సహా మ్యూచువల్‌ ఫండ్లు, ఎన్‌పీఎస్‌ వంటి నమ్మకమైన వాటిల్లో పెట్టుబడి పెట్టాలి. అదే ఎవరో చెప్పారని నష్టభయం ఎక్కువగా ఉన్న స్టాక్స్‌లోనో లేక అధిక వడ్డీరేటుకు తెలియని వ్యక్తులకు డబ్బు ఇవ్వడమో చేస్తే కష్టపడి సంపాదించిన సొమ్ము నేలపాలైనట్లే.


లక్ష్యముంటేనే విజయం

‘‘ఒకపని మొదలుపెట్టే ముందు మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు సంధించుకోండి. ఎందుకు చేస్తున్నాం? ఫలితాలు ఎలా ఉండొచ్చు? విజయం వరిస్తుందా? వీటిపై లోతుగా ఆలోచించి సంతృప్తికరమైన సమాధానం దొరికితేనే ముందుకు వెళ్లండి. లక్ష్యాన్ని నిర్దేశించుకోలేని వారు విజయం సాధించలేరు’’ - చాణక్య

జీవితంలో అన్ని విషయాల్లోలాగే పెట్టుబడుల విషయంలోనూ ఓ నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. లేదంటే ఎక్కడ మదుపు చేయాలి? ఎంత చేయాలి? ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయాలి? అనే అంశాలపై స్పష్టత ఉండదు. అదే మీరు మీ పెట్టుబడికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోగలిగితే పై ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఏ సమయానికి ఎంత సంపాదించాలో తెలిస్తే ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలో తెలుసుకోవడం కూడా సులభమవుతుంది.


తాత్కాలిక నష్టాలకు భయపడొద్దు

‘‘మీరు ఒక పనిని ప్రారంభిస్తే.. ఓటమి గురించి భయపడొద్దు. ఎట్టిపరిస్థితుల్లో దాన్ని మధ్యలో విడిచిపెట్టొద్దు. నిజాయతీగా పనిచేసేవారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు’’- చాణక్య

గత 30 ఏళ్లలో స్టాక్‌మార్కెట్లు అనేక దిద్దుబాట్లకు గురయ్యాయి. విపత్తులు, కుంభకోణాలు, ఆర్థిక మందగమనం.. వంటి కారణాలు అందుకు దోహదం చేశాయి. అయితే, సూచీలు ఎంత పడిపోయినప్పటికీ.. తిరిగి కోలుకొని కొత్త రికార్డులు సృష్టించాయి.

చాలా మంది మదుపర్లు మార్కెట్‌ దిద్దుబాటు సమయంలో భయాందోళనకు గురవుతారు. చివరకు నష్టాల్లో ఉన్నప్పుడు వారి పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. దీంతో పేపర్‌పై ఉన్న నష్టాలను కాస్తా నిజమైన నష్టాలుగా మార్చుకుంటారు. కానీ, ఆ సమయంలో నిలకడగా ఉన్నవాళ్లు తర్వాత అనేక రెట్ల రాబడిని పొందారు.


అతి అనర్థం

‘‘అతి అహంకారం రావణుడి చావుకి దారితీసింది. అతి దానగుణం వల్ల బలి చక్రవర్తి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఏదైనా అతి అనర్థం. దాన్నుంచి దూరంగా ఉండాలి’’ - చాణక్య

ఏ పనిలోనైనా అతి ప్రదర్శించొద్దని చాణక్యుడు స్పష్టంగా చెప్పారు. ఇది పెట్టబడులకు కూడా వర్తిస్తుంది. ఏదైనా ఒకే పెట్టుబడి మార్గంలో అధికంగా మదుపు చేస్తే ప్రతికూల ఫలితాలు రావొచ్చు. అందుకే మన పెట్టుబడిని వివిధీకరించాలి(డైవర్సిఫై). దీని వల్ల చాలా లాభాలుంటాయి. అన్ని పెట్టుబడి మార్గాలు అన్ని సందర్భాల్లో ఒకే విధమైన రాబడిని ఇవ్వలేవు. కొన్ని నష్టాల్ని తెచ్చి పెడితే.. కొన్ని భారీ లాభాల్ని అందిస్తాయి. అదే డైవర్సిఫై చేస్తే నష్టాల్ని తగ్గించుకోవచ్చు.


ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడం

‘‘ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలి. అన్ని తప్పులూ మీరే చేసి నేర్చుకోవాలంటే ఒక జీవితం సరిపోదు’’ - చాణక్య

మనం అనుభవాల నుంచి ముఖ్యంగా తప్పుల నుంచి చాలా నేర్చుకుంటాం. కానీ, సమయం చాలా విలువైంది. కాబట్టి త్వరగా, వేగంగా నేర్చుకోవాలంటే ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. చాలా మంది విజయవంతమైన మదుపర్లు, ఆర్థిక నిపుణులు.. వారు చేసిన పొరపాట్లు, అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. వాటిని చదవడం వల్ల అనేక విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ప్రామాణికమైన వెబ్‌సైట్లలో ఉన్న సమాచారాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యంగా మన బంధువులు, మిత్రులు వేసే తప్పటడుగులను నిశితంగా పరిశీలించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని