Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియంపై GST.. కేంద్రం ఏమందంటే?

ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గించే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎటువంటి సిఫార్సు ప్రస్తుతం జీఎస్‌టీ మండలి పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.

Published : 06 Dec 2021 18:41 IST

దిల్లీ: కొవిడ్‌-19 విజృంభణ వేళ.. ఆరోగ్య బీమా తీసుకోవడంపై ఎక్కువ మంది ప్రజలు దృష్టి పెడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు క్లెయింలు ఎక్కువ కావడంతో బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీమా ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (GST) 18శాతం చెల్లించాల్సి రావడం పట్ల పాలసీదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరోగ్య బీమాపై జీఎస్‌టీ తగ్గించాలనే డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వీటిపై  కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గించే యోచన లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎటువంటి సిఫార్సు జీఎస్‌టీ మండలి పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్న జీఎస్‌టీ కౌన్సిల్‌ సిఫార్సులకు అనుగుణంగా మాత్రమే జీఎస్‌టీ ఎంత ఉండాలనేది నిర్ణయింపబడుతుంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ రేటును తగ్గించే ఎటువంటి సిఫార్సు ప్రస్తుతం జీఎస్‌టీ మండలి పరిశీలనలో లేదు’ అని లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కారద్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇదిలాఉంటే, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంపై అధిక జీఎస్‌టీ ఉండడం వల్ల పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాల, విశ్రాంత ఉద్యోగులు తక్కువ మొత్తం వైద్యబీమా పాలసీల వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్‌టీని తగ్గించడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే హెల్త్ పాలసీ ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గించే యోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని