Billionaires: మన దేశంలో బిలియనీర్లు.. 136 మంది

దేశంలో అపరకుబేరుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019-20లో భారత్‌లో 141 మంది బిలియనీర్లు ఉండగా.. 2020-21లో ఆ సంఖ్య 136గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక

Published : 10 Aug 2021 17:04 IST

దిల్లీ: దేశంలో అపరకుబేరుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019-20లో భారత్‌లో 141 మంది బిలియనీర్లు ఉండగా.. 2020-21లో ఆ సంఖ్య 136గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సమయంలో రూ.100కోట్లకు పైగా ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తులను ఈ జాబితాలో చేరుస్తారు. 2018-19లో 77 మంది బిలియనీర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు రెట్టింపునకు చేరుకోవడం గమనార్హం. ఇక 2016 నుంచి సంపద పన్నును రద్దు చేయడంతో ఈ కుబేరుల పూర్తి సంపద వివరాలు సీబీడీటీ వద్ద లేవని కేంద్రమంత్రి తెలిపారు. 

ఇక నిత్యావసరాల ధరలకు సంబంధించిన మరో ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ బదులిస్తూ.. ‘‘దేశంలో ధరల పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ధరల స్థిరీకరణ కోసం తగిన చర్యలు చేపడుతున్నాం’’ అని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు చెప్పారు. పప్పు ధాన్యాల నిల్వలపై పరిమితి విధించినట్లు పేర్కొన్నారు. 

1.33లక్షల మందికి హామీ లేని రుణాలు

కొవిడ్‌ మహమ్మారి వేళ చికిత్స ఖర్చు కోసం హామీ లేని(అన్‌సెక్యూర్డ్‌) రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకొచ్చాయి. అలా జులై 15, 2021 నాటికి 1.33లక్షల మందికి కరోనా చికిత్స నిమిత్తం సెక్యూరిటీ లేని రుణాలు పొందినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 

సహకార బ్యాంకుల్లో మోసాలు తగ్గాయ్‌..

గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో మోసాలు కొంతమేర తగ్గాయని నిర్మల తెలిపారు. అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో 2019-20లో 568 మోసాలు వెలుగుచూడగా.. 2020-21లో ఆ సంఖ్య 323గా ఉందని చెప్పారు. రాష్ట్ర సహకార బ్యాంకుల్లోనూ మోసాలు 508 నుంచి 482కు తగ్గినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు