Paytm Q2 Results: పేటీఎం ఆదాయంలో 64% వృద్ధి

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ నికర నష్టాలు రూ.474 కోట్లకు పెరిగాయి.....

Published : 27 Nov 2021 17:55 IST

రూ.474 కోట్లకు పెరిగిన నికర నష్టాలు

దిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ నికర నష్టాలు రూ.474 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టాలు రూ.437 కోట్లుగా నమోదయ్యాయి. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 64 శాతం పెరిగి రూ.1,090 కోట్లకు చేరింది. యూపీఐయేతర చెల్లింపుల్లో(జీవీఎం) 52 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అలాగే ఆర్థిక సేవల నుంచి వచ్చే ఆదాయంలోనూ మూడింతల వృద్ధి నమోదైంది.

విభాగాలవారీగా చూస్తే.. చెల్లింపులు, ఆర్థిక సేవల నుంచి వచ్చే ఆదాయం రూ.842.6 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.497.8 కోట్లతో పోలిస్తే 69 శాతం వృద్ధి కనిపించింది. క్లౌడ్‌ అండ్‌ కామర్స్ విభాగపు ఆదాయం 47 శాతం పెరిగి రూ.243.8 కోట్లకు చేరుకుంది. ఇక ప్రత్యక్ష ఖర్చులు రూ.626 కోట్ల నుంచి 32 శాతం పెరిగి రూ.825.7 కోట్లకు చేరాయి.

పేటీఎం షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తర్వాత వెలువడిన తొలి త్రైమాసిక ఫలితాలు ఇవే. లిస్టింగ్‌ రోజు తీవ్ర నష్టాల్ని చవిచూసిన సంస్థ షేర్లు.. తర్వాత వరుసగా మూడు రోజుల పాటు ఎగబాకిన విషయం తెలిసిందే. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి షేరు ధర రూ.1,782.60 వద్ద ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని