Petrol Price: పెట్రోల్‌ సూపర్‌ స్పీడ్‌.. అక్కడ రూ.120 దాటింది!

మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.120  మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.110కిపైగా ఉండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

Updated : 27 Oct 2021 16:31 IST

అక్టోబర్‌ నెలలోనే 19సార్లు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

భోపాల్‌: దేశంలో పెట్రోల్‌ ధరలు (Petrol Price) రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటరు ధర వంద రూపాయల మార్కు దాటిన అనంతరం ఇవి మరింత వేగంగా పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.120 మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరలు రూ.110కిపైగా ఉండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లా కేంద్రంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.120.4కు చేరగా.. డీజిల్‌ ధర రూ.110కి చేరువయ్యింది. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్‌లోనూ లీటరు పెట్రోల్‌ రూ. 119.23పైసలుగా నమోదైంది. రాజధాని భోపాల్‌లోనూ లీటరు ధర రూ.116.62గా ఉంది. మంగళవారం నాడు పెట్రోల్‌పై 36పైసలు పెరగడంతో మరుసటి రోజు రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.120 మార్కును దాటినట్లు స్థానిక డీలర్‌ అభిషేక్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో దాని ధర రూ.109.17కి చేరిందన్నారు. దాదాపు 250కి.మీ దూరంలో ఉన్న జబల్‌పూర్‌ ఆయిల్‌ డిపో నుంచి అనుప్పూర్‌ జిల్లా కేంద్రానికి పెట్రోల్‌ సరఫరా అవుతుందని.. అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఇంధన ధరలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

అక్టోబర్‌లోనే 19 సార్లు..

దేశంలో గతరెండు రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచని ఆయిల్‌ సంస్థలు నేడు (27-10-2021) మరోసారి పెంచాయి. దీంతో దేశ రాజధానితోపాటు అన్ని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది. అంతేకాకుండా ఈ అక్టోబర్‌ నెలలోనే ఆయిల్‌ ధరలు 19 సార్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

నగరం           పెట్రోల్‌ (రూ.లలో)     డీజిల్‌ (రూ.లలో)

దిల్లీ            107.94               96.67

ముంబయి      113.80               104.75

పుణె            113.31               102.66

హైదరాబాద్‌     112.27               105.46

బెంగళూరు      111.70              102.60

కోల్‌కతా        108.45              99.78

చెన్నై           104.83             100.92

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని