Vehicle Scrappage Policy: ‘తుక్కు విధానం’తో అన్‌ఫిట్‌ వాహనాలకు స్వస్తి: మోదీ

ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వాహన తుక్కు విధానం వల్ల ఫిట్‌నెస్‌ లేని వాహనాలకు స్వస్తి పలకడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 13 Aug 2021 16:09 IST

భారీగా పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్న ప్రధానమంత్రి

దిల్లీ: ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వాహన తుక్కు విధానం వల్ల ఫిట్‌నెస్‌ లేని వాహనాలకు స్వస్తి పలకడంతో పాటు కాలుష్యం తగ్గడానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విధానంతో దాదాపు రూ.10వేల కోట్లు పెట్టుబడులు వచ్చే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ప్రారంభించారు.

దేశంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని.. స్థిరమైన, పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రవాణా రంగంలో వస్తోన్న ఆధునిక విధానాలు రవాణా, ప్రయాణ భారాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడతాయని అన్నారు. ఈ స్క్రాపింగ్‌ పాలసీ వల్ల మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. కేవలం వాహనాల జీవనకాలాన్ని బట్టే కాకుండా ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌లో ఫిట్‌నెస్‌ లేనివి అని తేలినా.. వాటిని తుక్కుగానే పరిగణిస్తారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇలా తుక్కుగా మారిన పాత వాహనాలకు ధ్రువపత్రం కూడా జారీచేస్తారని.. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో వాహన పన్నులపై రాయితీ లభించనుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే, స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు; 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగు పడటంతో పాటు పర్యావరణహిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుందని సీతారామన్‌ పేర్కొన్నారు. ఇక వాహన తుక్కు విధానం కింద పాతది ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయని కేంద్ర రవాణాశాఖ ఇదివరకే ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని