Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జోష్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి....

Published : 01 Dec 2021 15:41 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అంతగా చింతించాల్సిన అసవరం లేదన్న ఆర్థిక నిపుణుల అంచనాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. మరోవైపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ నుంచి ఎంతో కొంత మేర రక్షణనిస్తాయన్న పలువురు నిపుణుల అంచనాలు కూడా సూచీల్లో ఉత్సాహం నింపాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో దేశ వృద్ధి రేటు అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదు కావడం కూడా సూచీల పరుగుకు దోహదం చేసింది. నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లుగా నమోదు కావడం కలిసొచ్చింది. ఇక ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్లు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు రాణించాయి.

ఉదయం సెన్సెక్స్‌ 57,365.85 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,846.45 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 619.92 పాయింట్ల లాభంతో 57,684.79 వద్ద ముగిసింది. 17,104.40 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,213.05 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 183.70 పాయింట్లు లాభపడి 17,166.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.92 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 23 షేర్లు లాభపడ్డాయి.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని