Stock market: సూచీలకు మళ్లీ ఒమిక్రాన్‌ భయాలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం సూచీలు భారీ నస్టాల్లో ముగిశాయి.....

Updated : 03 Dec 2021 16:12 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ భయాలతో పాటు అంర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు సూచీలను కిందకు లాగాయి. మార్కెట్లు ప్రారంభమైన తొలి గంటపాటు స్వల్ప లాభాల్లో ట్రేడయినా మధ్యాహ్నం వరకు కొంత ఫ్లాట్‌గా కదలాడాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో  మధ్యాహ్నం తర్వాత అంతకంతకూ దిగజారుతూ పోయాయి. రెండు రోజుల వరుస లాభాలను మదుపర్లు నేడు స్వీకరించారు. మరోవైపు ఒమిక్రాన్‌ రీఇన్‌ఫెక్షన్లు, దానిపై వ్యాక్సిన్ల సామర్థ్యం గురించి వస్తున్న ఊహాగానాలు మదుపర్లను మరింత గందరగోళానికి గురిచేశాయి. నేడు వారాంతం కావడంతో వచ్చే రెండురోజుల్లో ఏ వార్తలు రానున్నాయనే భయంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. మరోవైపు అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ దీదీ ప్రకటించడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే తనిఖీలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిందేనన్న అమెరికా ఎస్‌ఈసీ నిర్ణయం చైనా కంపెనీలను శరాఘాతమేనని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 58,555.58 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,640.57 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 764.83 పాయింట్ల నష్టంతో 57,696.46 వద్ద ముగిసింది. 17,424.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,180.80 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 183.70 పాయింట్లు నష్టపోయి 17,166.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.17 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 25 షేర్లు నష్టపోయాయి. టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. 

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని