Stock market: రెండో రోజూ లాభాలు.. మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన బుధవారం లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి, దాని కట్టడికి ప్రభుత్వ అప్రమత్తత, అంతర్జాతీయ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి....

Updated : 22 Dec 2021 16:06 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన బుధవారం లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి, దాని కట్టడికి ప్రభుత్వ అప్రమత్తత, అంతర్జాతీయ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి.


సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 56,599.47 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. రోజంతా అదే బాటలో పయనించి ఇంట్రాడేలో 56,989.01 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 611.55 పాయింట్ల లాభంతో 56,930.56 వద్ద ముగిసింది. 16,865.55 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 16,971.00 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 184.60 పాయింట్లు లాభపడి 16,955.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.54 వద్ద నిలిచింది.


మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాలు..

దేశీయంగా ఒమిక్రాన్‌ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్న హామీ మదుపర్లలో విశ్వాసం నింపింది. అమెరికాలో లాక్‌డౌన్లు ఉండబోవన్న అధ్యక్షుడు బైడెన్‌ కచ్చితమైన హామీ కూడా సూచీల సెంటిమెంటును పెంచింది. మరోవైపు ఇటీవలి సూచీల భారీ పతనం నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. వీటితో పాటు రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించడం కూడా సూచీలకు కలిసొచ్చింది.


మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* లిస్టింగ్‌లో నిరాశపరిచి.. ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన మెట్రో

ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 12.6 శాతం రాయితీతో ఆరంభంలోనే మదుపర్లను నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.500 కాగా 12.8 శాతం రాయితీతో రూ.436 వద్ద బీఎస్‌ఈలో.. 12.6 శాతం రాయితీతో రూ.737 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ ఈ స్టాక్‌ అనూహ్యంగా పుంజుకుంది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఓ దశలో స్వల్ప లాభాల్లోకి వెళ్లింది. చివరకు 4.5 శాతం నష్టంతో రూ.495.95 వద్ద స్థిరపడింది.

*  కొత్త షేర్ల జారీ, రుణం లేదా ఇతర ఆమోదయోగ్య మార్గాల ద్వారా రూ.10 వేల కోట్ల సమీకరణకు బోర్డు అనుమతి లభించడంతో యెస్‌ బ్యాంక్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 5 శాతం పుంజుకున్నాయి.

* షేర్‌ సేల్‌ ప్రక్రియ ద్వారా రూ.2,000 కోట్ల నిధులను సమీకరించాలని దీపక్‌ నైట్రేట్‌ నిర్ణయించింది. 

* ఐడీఎఫ్‌సీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌గా అనిల్‌ సింఘ్వీ నియామకాన్ని సంస్థ ఆమోదించడంతో ఈ రోజు ఈ కంపెనీ షేర్లు 5.51 శాతం మేర ర్యాలీ అయ్యాయి. 

* నిఫ్టీ ఫార్మాలోని 20 షేర్లలో 19 లాభపడడం విశేషం. 

* ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌కు ప్రముఖ డెవలపర్‌ నుంచి రూ.1000-2500 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ ఖరారైంది. దీంతో ఎల్‌అండ్‌టీ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 1.7 శాతం పుంజుకున్నాయి.

* ప్రముఖ రేటింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ.. పేటీఎం స్టాక్‌పై మదుపర్లకు బై(BUY) రికమండేషన్‌ ఇవ్వడంతో సంస్థ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 1.3 శాతం మేర లాభపడ్డాయి.

* బ్యాటరీ బిజినెస్‌ కోసం ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఎబీబీ ఇండియా నిర్ణయించింది. దీంతో ఈ సంస్థ షేర్లు ఇంట్రాడేలో 6 శాతం మేర లాభపడ్డాయి.

* రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ షేర్లు గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 17 శాతం లాభపడడం విశేషం.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని