Updated : 27 Dec 2021 15:59 IST

Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి సూచీలు.. ఆర్‌బీఎల్‌ ఢమాల్‌.. మరిన్ని మార్కెట్‌ కబుర్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత కోలుకున్నాయి. ఒమిక్రాన్‌ భయాలు వెంటాడినప్పటికీ.. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

 


సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 56,948.33 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు అదే బాటలో పయనించింది. తర్వాత కీలక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో లాభాల్లోకి ఎగబాకిన సూచీ 57,512.01 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 295.93 పాయింట్ల లాభంతో 57,420.24 వద్ద ముగిసింది. 16,937.75 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,112.05 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 82.50 పాయింట్లు లాభపడి 17,086.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.98 వద్ద నిలిచింది. 


కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో మదుపర్లు తొలుత కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు. అయినప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. డాలరుతో పోలిస్తే రూపాయి స్వల్పంగా కోలుకోవడం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. మరోవైపు దేశంలో బూస్టర్ డోసుపై కేంద్రం ప్రకటన కూడా కలిసొచ్చింది. ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి.


మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* 20% కుంగిన ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు.. కారణమిదే

ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఆర్‌బీఎల్‌ షేర్లు ఈరోజు భారీ నష్టాలు చవిచూశాయి. ఓ దశలో 20 శాతం కుంగి లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. ఓ దశలో రూ.130.20 వద్ద 52 వారాల కనిష్ఠానికి చేరింది. తర్వాత బ్యాంకు ఆర్థిక స్థితి స్థిరంగానే ఉందని ఆర్‌బీఐ ప్రకటించడంతో స్వల్పంగా కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం తప్పలేదు. చివరకు 18.48 శాతం నష్టంతో రూ.140.95 వద్ద ముగిసింది. అసలు ఏం జరిగిందంటే.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ విశ్వవీర్‌ అహూజా బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈఓగా రాజీవ్‌ అహూజాను నియమించారు. బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న యోగేశ్‌ కె.దయాల్‌ను బోర్డులో అదనపు డైరెక్టర్‌గా ఆర్‌బీఐ నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఎల్‌ బ్యాంకులో పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. యెస్‌ బ్యాంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంకుల తరహా పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో పాటు నేరుగా ఆర్‌బీఐ రంగంలోకి దిగడాన్ని బ్రోకరేజీ సంస్థలు సీరియస్‌గా పరిగణించాయి. ఈ స్టాక్‌పై నెగెటివ్‌ రేటింగ్‌ ఇచ్చాయి. దీంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు విలువ అమాంతం పడిపోయింది.

హెచ్‌పీ అధెసివ్స్‌ ఒక్కో లాట్‌పై రూ.2,650 లాభం!

వివిధ రకాల అధెసివ్స్‌, సీలెంట్స్‌ను తయారు చేసే హెచ్‌పీ అధెసివ్స్‌ కంపెనీ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 14.96 శాతం ప్రీమియంతో మదుపర్లకు మంచి లాభాలనిచ్చాయి. ఇష్యూ ధర రూ.274 కాగా బీఎస్‌ఈలో రూ.315 వద్ద కంపెనీ షేర్లు నమోదయ్యాయి. ఐపీఓలో ఒక్కో లాట్‌కు 50 షేర్లు నిర్ణయించారు. అంటే ఒక్కో లాట్‌పై రూ.13,100 పెట్టుబడిగా పెట్టారు. దీంతో 14.96 శాతం ప్రీమియం లెక్కన ఒక్కో లాట్‌పై మదుపర్లు రూ.2,650 లిస్టింగ్ గెయిన్స్‌ని సొంతం చేసుకున్నారు. చివరు ఈ షేరు 20.71 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకి రూ.330.75 వద్ద నిలిచిపోయింది.

* పరాస్‌ డిఫెన్స్‌ షేర్లు ఈరోజు 8 శాతం మేర లాభపడ్డాయి. గత రెండు నెలల వ్యవధిలో ఇదే ఇంట్రాడే గరిష్ఠం కావడం విశేషం. సరిహద్దు నిఘా వ్యవస్థల సాంకేతికతల నిర్వహణకు డీఆర్‌డీవో ఈ సంస్థను ఎంపిక చేసింది.

* అశోకా బిల్డ్‌కాన్‌ షేర్లు 11 శాతం ఎగిశాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన అశోకా కన్సెషన్‌.. గ్యాలక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకొంది.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని