Stock Market Closing Bell: రోజంతా నష్టాల్లోనే సూచీలు

ఒమిక్రాన్‌ వ్యాప్తి అంతర్జాతీయంగా మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఆద్యంతం నష్టాల్లో కదలాడాయి.....

Updated : 14 Dec 2021 15:52 IST

ముంబయి: ఒమిక్రాన్‌ వ్యాప్తి అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో దేశీయ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఆద్యంతం నష్టాల్లో కదలాడాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వల్పంగా కోలుకున్నట్లు కనిపించినప్పటికీ.. అమ్మకాల ఒత్తిడితో మళ్లీ కిందకు దిగజారాయి. వివిధ దేశాల్లో సెంట్రల్‌ బ్యాంకుల సమావేశాలు ఈ వారం జరగనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్దీపనల ఉపసంహరణలు క్రమంగా ప్రారంభం కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఇక దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు కలవరపెడుతున్నాయి. రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణాలు పెరగడంతో సూచీల సెంటిమెంటు దెబ్బతింది. రూపాయి విలువ 18 నెలల కనిష్ఠానికి చేరింది. ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు నష్టాలు చవిచూశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 58,059.76 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,803.87 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 166.33 పాయింట్ల నష్టంతో 58,117.09 వద్ద ముగిసింది. 17,283.20 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,376.20-17,225.80 మధ్య కదలాడింది. చివరకు 43.35 పాయింట్లు నష్టపోయి 17,324.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.90 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 16 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్ షేర్లు నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని