Stock market Closing Bell: వరుసగా నాలుగో రోజూ సూచీల డీలా

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన బుధవారమూ నష్టాల్లో ముగిశాయి....

Updated : 15 Dec 2021 15:44 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన బుధవారమూ నష్టాల్లో ముగిశాయి. ఓవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తి కలవరపెడుతున్నప్పటికీ.. అమెరికా ఫెడరల్ రిజర్వు ఉద్దీపనల ఉపసంహరణవైపే అడుగులు వేయనుందన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. అలాగే వడ్డీరేట్లను సైతం పెంచే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు రోజంతా అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ఈరోజు కూడా ఎఫ్‌ఐఐలు నికర విక్రయదారులుగా నిలిచారు. ఇక ఇటీవల మార్కెట్‌లో లిస్టయిన పలు ఇంటర్నెట్‌ ఆధారిత కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవడం ప్రభావం చూపింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లు డీలాపడడం కూడా సూచీలను దెబ్బతీసింది. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్‌, ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు నష్టాలు చవిచూశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 58,122.00 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడేలో 57,671.61 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 329.06 పాయింట్ల నష్టంతో 57,788.03 వద్ద ముగిసింది. 17,323.65 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,351.20-17,192.20 మధ్య కదలాడింది. చివరకు 103.50 పాయింట్లు నష్టపోయి 17,221.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.23 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 9 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, టాటా స్టీల్‌ ఉన్నాయి. సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో షేర్లు రాణించాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని