Stock market: సడలిన బేర్‌ పట్టు.. ఒక్కరోజులోనే లాభాల్లోకి సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఒక్కరోజులోనే బేర్‌ పట్టు నుంచి సూచీలు బయటకు రావడం విశేషం. సోమవారం ఓ దశలో 1600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఈరోజు ఓ దశలో దాదాపు 350 పాయింట్లకు పైగా లాభపడింది....

Updated : 23 Nov 2021 15:42 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఒక్కరోజులోనే బేర్‌ పట్టు నుంచి సూచీలు బయటకు రావడం విశేషం. సోమవారం ఓ దశలో 1600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఈరోజు ఓ దశలో దాదాపు 350 పాయింట్లకు పైగా లాభపడింది. అంటే రెండు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు 1900 పాయింట్ల దిద్దుబాటు కనిపించింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లడంతో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలోనే సూచీలకు మళ్లీ లాభాలొచ్చాయి. ముఖ్యంగా రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. అలాగే ఇటీవల లిస్టయి భారీ నష్టాలు చవిచూసిన పేటీఎం, ఫినోపేమెంట్స్‌ షేర్లు సైతం నేడు పైకి ఎగబాకాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ.. దేశీయ సూచీలు రాణించాయి.

ఉదయం సెన్సెక్స్‌ 57,983.95 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,834.95 - 57,718.34 మధ్య కదలాడింది. చివరకు 198 పాయింట్ల లాభంతో 58,664.33 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 17,216.10 వద్ద కనిష్ఠాన్ని, 17,553.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 86.80 పాయింట్లు లాభపడి 17,503.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 21 షేర్లు లాభపడడం విశేషం. రాణించిన వాటిలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, రిలయన్స్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్లు రాణించాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, మారుతీ, టైటన్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని